Medical Recruitment: 1623 పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:07 AM
వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా భారీగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు వైద్యులు) పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
పీజీ మార్కుల ఆధారంగా నియామకం
మొత్తం వంద పాయింట్లు.. వెయిటేజీకి 20 పాయింట్లు
సెప్టెంబరు 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు.. 22 వరకు గడువు
టీవీవీపీ ఆస్పత్రుల్లో తీరనున్న స్పెషాలిటీ డాక్టర్ల కొరత
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా భారీగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు వైద్యులు) పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1623 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిఽధి ఆస్పత్రుల్లో 1616 పోస్టులు, టీఎ్‌సఆర్టీసీలో పరిధి ఆస్పత్రుల్లో ఏడు సీఏఎస్ పోస్టుల భర్తీకి బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలను చేపడతారు. అర్హులైన అభ్యర్ధులు సెప్టెంబరు 8 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు సెప్టెంబరు 22 సాయంత్రం ఐదుగంటల వరకు గడువిచ్చారు. ఈ పోస్టులన్నింటికి అర్హత వైద్యవిద్యలో పీజీ లేదా డిప్లొమో, డీఎన్‌బీ కోర్సు చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు అనుభవపూర్వక ధ్రువపత్రం జత చేయాల్సి వుంటుంది.
ఎంపికైన అభ్యర్థులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసేందుకు అనర్హులని నోటిఫికేషన్‌లోనే బోర్డు పేర్కొంది. ఇక అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించి ఉండకూ డదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు ఇచ్చారు. ఎన్‌సీసీ, ఎక్స్ సర్వీ్‌సమెన్‌కు మూడేళ్ల వయోపరిమితి సడలింపునిచ్చారు. అభ్యర్థులకు పీజీలో వచ్చిన మార్కులు, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుంటే వచ్చే మార్కుల ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. మొత్తం వంద పాయింట్లు ఉంటాయి. ఇందులో వెయిటేజీకి 20, వైద్యవిద్యలో పీజీ, డిప్లొమో, డీఎన్‌బీలో వచ్చిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కుల ఆధారంగా శాతాన్ని (పర్సేంటేజీని) లెక్కిస్తారు. వైద్యులు పీజీ పూర్తి చేసివుండి, సర్కారీ దవాఖానాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తేనే వెయిటెజీ ఉంటుంది. మరిన్ని వివరాలను www.mhsrbtelangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని బోర్డు సూచించింది. ఈ పోస్టుల భర్తీతో టీవీపీపీ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ డాక్టర్ల కొరత తీరనుంది.