Share News

Duddilla Shreedhar Babu: రాష్ట్రంలో రూ లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:34 AM

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030 నాటికి లక్ష కోట్ల పెట్టుబడుల్నిరాష్ట్రానికి తీసుకొచ్చి....

Duddilla Shreedhar Babu: రాష్ట్రంలో రూ లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

  • 2030 నాటికి లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తీసుకొచ్చేలా రోడ్‌మ్యాప్‌నకు కసరత్తు

  • దీంతో 5 లక్షల మందికి ఉపాధి

  • మెల్‌బోర్న్‌లో ‘ఆస్‌బయోటెక్‌ 2025’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030 నాటికి లక్ష కోట్ల పెట్టుబడుల్నిరాష్ట్రానికి తీసుకొచ్చి.. 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన, గురువారం లైఫ్‌ సైన్సెస్‌ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌ బయోటెక్‌’.. మెల్‌బోర్న్‌లో....


నిర్వహిస్తున్న ‘ఆస్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2025’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైఫ్‌ సైన్సెన్‌, ఉన్నతవిద్య, పరిశోధన రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఆయన వివరించారు. జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌, బీ హబ్‌, ఫ్యూచర్‌ సిటీ, అనుమతుల కోసం సింగిల్‌ విండో సిస్టమ్‌ వంటి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 20 నెలల కాలంలో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ఇందులో లైఫ్‌ సైన్సెస్‌ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘‘కాంప్రహెన్సివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ’’ని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రం భౌగోళికంగా 11, జనాభాలో 12వ స్థానాల్లో ఉన్నప్పటికీ, జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. 2024-25లో రాష్ట్ర జీఎ్‌సడీపీ రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని ఈ సందర్భంగా దిగ్గజ లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలను మంత్రి ఆహ్వానించారు. ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ‘గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ అట్లాస్‌ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్ల జాబితాలో భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న ఏకైౖక నగరం హైదరాబాద్‌ మాత్రమే అని అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌, సెంటర్‌ ఫర్‌ ది ఫోర్త్‌ ఇండస్ర్టియల్‌ రివల్యూషన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యం.. రాబోయే ‘‘బయో-డిజిటల్‌’’ యుగానికి కావాల్సిన ’రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌’ తయారీకి దోహదపడుతుందని మంత్రి అన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 04:34 AM