Health Crisis: కల్తీకల్లు రక్కసి.. ఆస్పత్రిపాల్జేసి
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:21 AM
అదే పనిగా వాంతులు.. విరేచనాలు! హైదర్‌నగర్, సర్దార్ పటేల్‌నగర్, ఇందిరానగర్, శంషాగూడ, ఎల్లమ్మబండ, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో 16 మందికి ఇలా ఒకే తరహా లక్షణాలు కనిపించాయి..
16మందికి అస్వస్థత.. అందరికీ ఒకే తరహా లక్షణాలు
ఒకరి పరిస్థితి విషమం.. ఐదుగురికి కిడ్నీలు విఫలం
కూకట్‌పల్లిలో కలకలం... 3 కల్లు దుకాణాలు సీజ్
కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిమ్స్, అడ్డగుట్ట, జూలై8 (ఆంధ్రజ్యోతి): అదే పనిగా వాంతులు.. విరేచనాలు! హైదర్‌నగర్, సర్దార్ పటేల్‌నగర్, ఇందిరానగర్, శంషాగూడ, ఎల్లమ్మబండ, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో 16 మందికి ఇలా ఒకే తరహా లక్షణాలు కనిపించాయి! కూకట్‌పల్లి పరిధిలో కల్తీకల్లు తాగడం వల్లే వీరంతా అస్వస్థతకు గురైట్లు వైద్యులు నిర్ధారించారు. అంతా మూడురోజుల క్రితం కూకట్‌పల్లి రాందేవ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేశ్ ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. కాగా బాధితుల్లో 12 మంది... మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన ఎం. యాదగిరి (41) హైదర్ నగర్‌కు చెందిన మాధవి (42) కూకట్‌పల్లికి చెందిన కోటేశ్వరరావు (58) శంషిగూడకు చెందిన కె. పెంటేశ్ (43) గోకుల్ ప్లాటుకు చెందిన ఎమ్. పోచమ్మ (34) అల్విన్ కాలనీకి చెందిన లక్ష్మి (34) మియాపూర్‌కు చెందిన జి.దేవదాస్ (69) నిజాంపేటకు చెందిన ఎ.రాములు (49) పర్వత్‌పూర్‌కు చెందిన టి.గోవిందమ్మ (61) కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన జి. మోనప్ప (55) కూకట్‌పల్లికి చెందిన నర్సింహ (39) జే.యోబు (55)ను మెరుగగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. వారిని అక్కడ అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మోనప్ప పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు.. అడ్డగుట్టకు చెందిన ఓదేలు, వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన కృష్ణయ్య, కూకట్‌పల్లికి చెంది విజయ్ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓదేలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుల్లో మరో ఐదుగురికి కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు సమాచారం. కల్తీకల్లు ఘటనకు సంబంధించి కూకట్‌పల్లి పరిధిలోని హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, శంశీగూడలో ఉన్న మూడు కల్లు కంపౌండ్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.