Share News

Supreme Court: రివ్యూకు తగిన కారణాలు లేవు!

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:56 AM

తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Supreme Court: రివ్యూకు తగిన కారణాలు లేవు!

  • హౌసింగ్‌ సొసైటీలకు భూ కేటాయింపుల రద్దు తీర్పును సమీక్షించడానికి నిరాకరించిన సుప్రీం

  • ప్రజాప్రతినిధులు, ఐఏఎ్‌సలు, జర్నలిస్టుల రివ్యూ పిటిషన్లను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సమీక్షించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తూ తీర్పు వెల్లడించింది. భూకేటాయింపులపై కొన్ని విధివిధానాలను నిర్ణయిస్తూ 2010లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వివిధ వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గతేడాది నవంబర్‌ 25న సీజేఐ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం భూముల కేటాయింపు జీవోనే కొట్టేసింది. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలు సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్‌ను దాఖలు చేశాయి. గురువారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ అగస్టీన్‌ జార్‌ ్జ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కరుణ, సమానత్వం ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. కోర్టు సముచితమని భావించిన మార్కెట్‌ రేట్లను చెల్లించడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారులతో సమానంగా జర్నలిస్టులను పరిగణించడం సరికాదని, జర్నలిస్టులకు నామమాత్రపు జీతాలున్నాయని, పెన్షన్‌ ప్రయోజనాలు లేవని జర్నలిస్టుల తరఫు న్యాయవాది గుర్తు చేశారు. తీర్పును రివ్యూ చేయడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని చెబుతూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.


జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్‌

సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టులెవరూ బాధపడొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సూచించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో ముందుగానే చర్చించి జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అవకాశవాద రాజకీయాలే కారణమని చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడం దురదృష్టకరమని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల వైఫల్యమేనని చెప్పారు. చాలీచాలని జీతాలతో అద్దె ఇండ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆ బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు.

Updated Date - Aug 22 , 2025 | 05:56 AM