వ్యవసాయ యాంత్రీకరణకు చేయూత
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:44 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఆరేళ్ల క్రితం నిలిచిన వ్యవసాయ యాంత్రీకరణను పునఃరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు
ఆరేళ్ల విరామం తర్వాత ప్రథకం పునరుద్ధరణ
సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం
మోత్కూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఆరేళ్ల క్రితం నిలిచిన వ్యవసాయ యాంత్రీకరణను పునఃరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. రైతులకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు 50శాతం సబ్సిడీపై ఇవ్వనుంది. అందుకు వ్యవసాయ యం త్రాల డీలర్లు, పరికరాలు తయారీదారుల నుంచి టెండర్లు ఆహ్వానించింది. టెండర్లలో పాల్గొనే కంపెనీ యజమానులు, డీలర్లకు అవగాహన కల్పిం చేందుకు జనవరి 30న వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో టెండర్లు, ఒప్పందం పూర్తిచేసి, మార్చి 15వ తేదీ లోపు రైతులకు యంత్రాలు, పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈ పథకంతో రైతులకు ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు మేలు చేకూరనుంది.
వ్యవసాయ యాంత్రీకరణలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం
వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్రప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం సమకూర్చుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది(2024-25) వ్యవ సాయ యాంత్రీకరణకు రూ.50కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. మార్చి 15వ తేదీ లోగా రైతులకు యంత్రాలు, పరికరాలు అందించి యూ సీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కేంద్రానికి సమర్పించి, వచ్చే ఏడాదిలో మరిన్ని ఎక్కువ నిధులు అడగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. మార్చిలోగా యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వినియోగించుకోంటే తిరిగి వెళ్తాయని డీలర్ల సమావేశంలో అధికారులు వెల్లడించినట్టు సమాచారం.
రైతుల్లో ఆనందం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018నుంచి యంత్రలక్ష్మీ పథకాన్ని నిలిపి వేయగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా వ్యవ సాయ యాంత్రీక రణను పునఃరుద్ధరిస్తున్నట్టు ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవు తోంది. రోజురోజుకు శ్రమశక్తి తగ్గి కూలీల కొరత రైతులను వేధిస్తోంది. 12 ఏళ్ల క్రితంతో పోల్చితే యంత్రాల వినియోగం బాగా పెరిగింది. యంత్రాలు, పనిముట్ల ధరలూ బాగానే పెరిగాయి. యంత్రాల వినియోగంతో రైతులకు శ్రమ తగ్గడంతో పాటు, తక్కువ సమయంలో పని పూర్తవు తున్నది. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్ ధర(కంపెనీ బట్టి) రూ.ఏడు లక్షల నుంచి రూ.8లక్షలు ఉంది. రోటవేటర్ రూ.1.50లక్షలు, కల్టివేటర్ సుమారు రూ.28 వేలు, కేజ్ వీల్స్(ఆఫ్ వీల్స్), రూ.19 వేలు, ఫ్లౌ రూ.38వేలు, పవర్ స్ర్పేయర్ రూ.15 వేలు ఉంటుంది. రైతులు అంత డబ్బు పెట్టి కొనలేకపోతున్నారు. యంత్రాలు, పరికరాలు అద్దెకు తెచ్చుకుని రైతులు పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు ఇస్తే సగం ధరకు వస్తున్నందున కొనుక్కొని వినియోగించుకోగలుగుతామని రైతులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాకు రూ.3కోట్ల విలువైన పరికరాలు
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యాంత్రీకరణకు రూ.50 కోట్లు కేటాయిం చడంతో జిల్లాకో రూ. కోటి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.మూడు కోట్లు, జిల్లా మంత్రులు చొరవ తీసుకుంటే రూ.3.50కోట్ల విలువ కలిగిన యంత్రాలు, పరికరాలు వస్తాయంటున్నారు. ట్రాక్టర్లు ఇస్తే నిధుల ఎక్కువగా వాటికే వెళుతాయని నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ చొప్పున ఇచ్చి, మిగితా పరికరాలు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పెరగనున్న యంత్రాల వినియోగం
కూలీల కొరత కారణంగా వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెరుగుతోంది. మొదట్లో రైతులు పంటలపై చేతి పంపుతో క్రిమి సంహాకర మందులు పిచికారీ చేసేవారు. ఆ తర్వాత పవర్ స్ర్పేయర్లతో పిచి కారీ చేస్తున్నారు. ఇప్పుడు డ్రోన్లు వాడుతున్నారు. వరి కోత యంత్రాలతో వరి కోసిన తర్వాత గడ్డి కూలీలతో ఎదిరించి తీసుకెళ్లి గడ్డివాము వేసేవారు. ఇప్పుడు కట్టలు కట్టే యంత్రాలో గడ్డి కట్టలు కట్టిస్తున్నారు. బండ్ పోర్మర్లతో పొలం గట్లు వేస్తున్నారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం పెరగడ ంతో రైతులు శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఆధునిక యంత్రాలను ఎక్కువగా వాడుతున్నారు. కాని యంత్రాలు, పరికరాలు రేట్లు అధి కంగా ఉండడంతో పూర్తి ధర రైతులు పూర్తి ధర చెల్లించి కొనలేక పోతున్నారు. ప్రభుత్వం ట్రాక్టర్లు, డ్రోన్లతో పాటు 20రకాల సాగు పరికరాలు సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు ట్రాక్టర్లు, పనిముట్ల తయారీ కంపె నీలతో రేట్లు, సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడానికి టెండర్లు పిలి చింది. టెండర్లు వేయడానికి ఫిబ్రవరి 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. వాటి తయారుదారులు, డీలర్లతో జనవరి 30న హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి టెండర్లు వేసే విషయంలో అవగాహన కల్పిం చారు. రేటు నిర్ణయించాక మార్చి 15వ తేదీ లోపు యంత్రాలు, పరికరాలు రైతులు అందించాల్సి ఉంటుందని అధి కారులు వారికి చెప్పినట్టు సమాచారం. ట్రాక్టర్లు, డ్రోన్లతో పాటు కల్టివేటర్, ప్లవ్, రోట వేటర్లు, గడ్డికట్టే యంత్రాలు, భూమిపై గడ్డిని తొలగించే బుష్‌కట్టర్లు, పొలం గట్లు వేసే బండ్ ఫోర్మర్లు, పవర్ వీడర్స్, మొక్కజొన్న గింజలు తీసే యంత్రాలు, పవర్ టిల్లర్లు, పవర్ స్ర్పేయర్లు, పంపుసెట్లను 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు.
2018లో నిలిచిన సబ్సిడీ పథకం
గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో యాం త్రీకరణను ప్రోత్స హించేందుకు, పూర్తి ధర చెల్లించి కొనలేని రైతులను ఆదుకోవడానికి 50శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పవర్ స్ర్పేయర్లు, చేతి పంపులు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవి. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం ట్రాక్టర్లు మాత్రమే 50 శాతం సబ్సి డీపై ఇచ్చింది. అవి కూడా అప్పటి అధికార పార్టీ వారికే దక్కాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వకుండా పూర్తిగా నిలిపి వేశారు. తగినంత ఆర్థిక స్థోమత లేని రైతులు పూర్తి డబ్బు చెల్లించి కొనలేకపోయారు.
రైతులకు ఉపయోగంగా ఉంటుంది
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 నుంచి యంత్రాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఎత్తేయడంతో పేద, మధ్య తరగతి రైతులు పూర్తి ధర చెల్లించి కొనలేక ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని పున ఃరుద్ధరించడం మంచి నిర్ణయం. రైతులకు ఎంతో ఉప యోగంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించిన యూనిట్లు తక్కువగా ఉన్నాయి. యూనిట్ల సంఖ్య పెంచాలి.
బద్దం స్వామిరెడ్డి, రైతు, మోత్కూరు.