Share News

ఆయిల్‌పాం కోసం అడుగులు

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:44 PM

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును పెంచేందుకు ప్రభుత్వం మరో అడుగువేస్తోంది. ఆయిల్‌పాం రైతులకు రవాణా ఖర్చులు, శ్రమను ఆదా చేయాలని తెలంగాణ ఆయి ల్‌ఫెడ్‌ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గా నికి ఒకటి చొప్పున ఆయిల్‌పాం గెలల సేకరణ (కొనుగోలు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావి స్తోంది.

ఆయిల్‌పాం కోసం అడుగులు
జనగామ నర్సరీలోని ఆయిల్‌పాం మొక్కలు

గెలల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మాణానికి చర్యలు

రూ.కోటితో నిర్మించేందుకు సర్కారు ప్రతిపాదనలు

జిల్లాలో మూడు చోట్ల స్థలాల గుర్తింపు

సాగు, పంట అమ్మకాలపై రైతులకు అవగాహన

ఆయిల్‌ఫెడ్‌ చొరవతో అన్నదాతల్లో ఆనందం

జనగామ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును పెంచేందుకు ప్రభుత్వం మరో అడుగువేస్తోంది. ఆయిల్‌పాం రైతులకు రవాణా ఖర్చులు, శ్రమను ఆదా చేయాలని తెలంగాణ ఆయి ల్‌ఫెడ్‌ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గా నికి ఒకటి చొప్పున ఆయిల్‌పాం గెలల సేకరణ (కొనుగోలు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావి స్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో సేకరణ కేంద్రాల కోసం అధికారులు స్థల సేకరణ చేపట్టే పనిలో ఉన్నారు. అతి త్వరలోనే భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి రెండు నెలల్లోగా సేకరణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాటు

జనగామ జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో నాలుగు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారు లు భావిస్తున్నారు. ఇందుకోసం అనుకూలంగా ఉండే ప్రభుత్వ స్థలాల కోసం జిల్లా ఉద్యానవన, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు అన్వేషిస్తున్నారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి జనగామ మండలం పసరమడ్ల శివారు చంపక్‌హిల్స్‌లో, పాలకుర్తి నియోజకవ ర్గానికి సంబంధించి కొడకండ్ల మండలం మొండ్రా యి, రంగాపురం వద్ద, స్టేషన్‌ఘ న్‌పూర్‌ నియో జకవర్గానికి సంబంధించి నమిలిగొండలో స్థలాలను అధికారులు పరిశీలించారు. ఈ నాలుగిం టిలో చంపకహిల్స్‌లో స్థల ఎంపిక దాదాపు పూర్తిగా మిగతా చోట్ల ఎంపిక ఖరారు కావాల్సి ఉంది.

రూ.కోటితో నిర్మాణం..

ఆయిల్‌పాం గెలల సేకరణ కేంద్రాల నిర్మాణం కోసం ఒక్కో దానికి రూ. కోటి చొప్పున నిధులు కేటాయించనున్నారు. కేంద్రం కోసం రెండు ఎకరాల స్థలం అవసరమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. కొనుగోలుకు అనుకూలంగా సీసీ కల్లాలను నిర్మించనున్నారు. వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భావిస్తున్నారు. సీసీ కల్లాలు, కార్యాలయ భవనం, వేబ్రిడ్జి నిర్మాణంతో పాటు చుట్టూ ఫెన్సింగ్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు కరెంట్‌, తాగునీటి వసతి సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి కలిగేలా..

ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సర్కారు భావిస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. సాగుకు సంబంధించి రాయితీలు అందిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట లాంటి కొన్ని జిల్లాలు మినహా చాలా వరకు జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంది. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 7 వేల ఎకరాల్లో సాగు అవుతోంది. ఈ విస్తీర్ణం 30వేల ఎకరాలకు చేరితే ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఆయిల్‌పాం ఒక్కసారి సాగు చేస్తే మూడేళ్ల తర్వాత ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. అయితే మూడేళ్ల తర్వాత డిమాండ్‌ ఉంటుందా, లేదా? అన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. ఆయిల్‌పాం ప్రాసెసింగ్‌ కంపెనీ సైతం జిల్లాలో లేకపోవడం రైతులను సాగుకు ముందుకు రాకుండా చేస్తోంది. అంతేకాకుండా పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొంటుందా, లేదా? అన్న సందిగ్ధత కూడా ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఈ అనుమానాలను రైతులు అధిగమించేలా చేసేందుకు గానూ ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయం తీసుకుంది.

అందుబాటులో ఉండేలా సేకరణ కేంద్రాలు

జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌

జనగామ జిల్లాలోని ఆయిల్‌పాం రైతులకు అందుబాటులో ఉండేలా ఆయిల్‌పాం గెలల సేకరణ కేంద్రాలను నిర్మాణం చేయాలని భావిస్తున్నాం. జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో నాలుగు చోట్ల స్థల పరిశీలన చేశాం. త్వరలోనే నిర్మాణాలకు నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాం. రెండు, మూడు నెలల్లో సేకరణ కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ కేంద్రాల ద్వారా రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే గెలలను అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనితో రవాణా ఖర్చు తగ్గడంతో పాటు శ్రమ, సమయం ఆదా అవుతుంది.

Updated Date - Jan 03 , 2025 | 11:44 PM