Share News

Flood Inflows to Krishna Projects: కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా వరద

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:45 AM

కృష్ణా ప్రాజెక్టులకు వరద నిలకడగా వచ్చి చేరుతోంది. సోమవారం ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 30

Flood Inflows to Krishna Projects: కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా వరద

శ్రీశైలానికి 1.52 లక్షలు, సాగర్‌కు 65,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి34,734 క్యూసెక్కుల ప్రవాహం

  • హైదరాబాద్‌, పలు జిల్లాల్లో వానలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కృష్ణా ప్రాజెక్టులకు వరద నిలకడగా వచ్చి చేరుతోంది. సోమవారం ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 20 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 55 వేల క్యూసెక్కులను కిందకు విడుస్తున్నారు. ఉజ్జయిని ప్రాజెక్టుకు 2,551 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 2,279 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.19 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. తుంగభద్రకు 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డు అవుతుండగా... ఔట్‌ఫ్లో 23 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1.01 లక్షల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 65,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 76 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 4 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ఇటు పులిచింతల ప్రాజెక్టుకు 91 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 1.05 లక్షల క్యూసెక్కులుగా రికార్డయింది. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు తప్ప మిగతా ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద వస్తోంది. సింగూరుకు 5,170 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 4,690 క్యూసెక్కులు, ఎస్సారెస్పీకి 34,734 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. ఇక రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 1793 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుదుత్పత్తి జరిగింది.


పలు జిల్లాల్లో వానలు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. జిల్లాల్లో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా వానలు పడ్డాయి. గద్వాల జిల్లా అలంపూర్‌లో 7.1 సెం.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగాయి. హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల్లోకి భారీగా వరద చేరడంతో కొన్ని గేట్లు ఎత్తారు. హిమాయత్‌సాగర్‌ 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లిలో భాస్కర్‌ అనే వ్యక్తి వాగులో దూకడంతో గల్లంతయ్యాడు. వానలకు వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం భారీగా పెరిగింది.

రేపట్నుంచి అతి భారీ వర్షాలు..

రాష్ట్రంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 13 నుంచి 17 వరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

Updated Date - Aug 12 , 2025 | 04:45 AM