Sri Tejas Father Opens Up: పుష్ప 2 తొక్కిసలాట ఘటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న శ్రీతేజ్ తండ్రి మాటలు..
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:33 PM
ఏడాది క్రితం పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 10 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. నిన్నటితో(బుధవారం)తో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయింది. ప్రమాదం జరిగి సంవత్సరం అయినా కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ మాట్లాడలేకుండా.. నడవలేకుండా ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ‘నా భార్యను కోల్పోయి ఏడాది అయింది. శ్రీ తేజ్‌కు గత నాలుగు నెలల నుంచి ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నాం. ఇంటి వద్ద చికిత్స కష్టతరంగా మారింది. ట్రీట్మెంట్ కోసం గత 15 రోజులుగా మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకు వస్తున్నాము. అల్లు అర్జున్ మా బాబు శ్రీ తేజ్ వైద్య ఖర్చుల విషయంలో అన్ని విధాల సాయంగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీ తేజ్ మాట్లాడటం లేదు... ఎవర్నీ గుర్తు పట్టడం లేదు. అమ్మ ఏదీ అని ఒక్కోసారి మా పాప అడుగుతూ ఉంది. ఆ సమయంలో వేరొక విషయాలు చెప్పి డైవర్ట్ చేస్తున్నాం.
శ్రీ తేజ కోలుకోకపోవడంతో ఉద్యోగం మానేశా. ఎప్పుడు కోలుకుంటాడో డాక్టర్లు చెప్పడం లేదు. భార్య దక్కలేదు.. కనీసం కుమారుడినైనా కాపాడుకోవాలని భావిస్తున్నాం. పెరిగిన ఖర్చులు కూడా భరిస్తామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు’ అని అన్నారు. కాగా, శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవటానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్‌లో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం
రష్యాతో రెండు బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందా.. నిజమెంత..