పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Feb 06 , 2025 | 01:20 AM
నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి సారించారు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడమే కాకుండా మరింత మెరుగుపరుచాలని సూచించారు.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి సారించారు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడమే కాకుండా మరింత మెరుగుపరుచాలని సూచించారు. వారం రోజుల క్రితం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ పమేలా సత్పతి కార్పొరేషన్‌లోని ప్రధాన విభాగాలైన సానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, సాధారణ పరిపాలన విభాగం హెడ్స్‌తో సమావేశమయ్యారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలంటూ అధికారులకు సూచించారు. కార్యాలయంలో అంతర్గత బదిలీలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రత్యేకంగా పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని, ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి చేయాలంటూ శానిటరీ అధికారులకు సూచించారు.
ఫ చెత్త సేకరణపై సూచనలు
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆ తర్వాత రోజున శానిటరీ అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డివిజన్లలో ఆమె విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ కార్మికులకు పలు ఆదేశాలు జారీ చేశారు. చాలా కాలంగా టైర్లు దెబ్బతినడంతో వర్క్‌షాపులో మూలనపడ్డ వాహనాలకు టైర్లు తెప్పించి, వాహనాల మరమ్మతులు చేయించి పూర్తిస్థాయిలో వాహనాలతో చెత్తసేకరణకు వినియోగించాలని సూచించారు.
ఫ విలీన పంచాయతీలకు ప్రత్యేక కార్యాచరణ
కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింతకుంట, దుర్శేడ్, బొమ్మకల్, గోపాల్‌పూర్ గ్రామాలు కార్పొరేషన్‌లో ఇటీవల విలీనమయ్యాయి. ఆయా గ్రామపంచాయతీల రికార్డులు, ఆస్తులను స్వాఽధీనం చేసుకొని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీలను వార్డు కార్యాలయాలుగా మార్చి వార్డు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, కార్మికులు ప్రత్యేక దృష్టిపెట్టి పారిశుధ్య పనులను మెరుగుపరచాలని ఆదేశించారు.
ఫ అధికారులకు డివిజన్ల బాధ్యతలు
వెటర్నరీ డాక్టర్, ఇద్దరు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లను సూపర్‌వైజింగ్ అధికారులుగా నియమించి 60 డివిజన్లలో శానిటేషన్‌తోపాటు ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూళ్లు, కార్మికుల హాజరు, ఇతర బాధ్యతలను అప్పగించారు. వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్‌కు విలీన గ్రామాలైన చింతకుంట, దుర్శేడ్‌తోపాటు 1, 2, 3, 4, 5, 6, 20, 21, 23, 24, 25, 26, 27, 28, 29, 42, 43, 44, 45 డివిజన్ల సూపర్‌వైజింగ్ బాధ్యతలను అప్పగించారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కె స్వామిని బొమ్మకల్, గోపాల్‌పూర్‌తోపాటు 7, 8, 10, 11, 12, 13, 30, 31, 32, 33, 34, 35, 46, 47, 48, 49, 50, 51, 52, 53 డివిజన్లకు సూపర్‌వైజింగ్ అధికారిగా నియమించారు. మరో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి రమేశ్‌కు కొత్తపల్లి మున్సిపాలిటీ, లక్ష్మిపూర్, మల్కాపూర్ గ్రామాలతోపాటు 15, 16, 17, 18, 19, 20, 36, 37, 38, 39, 40, 41, 55, 56, 57, 58, 59, 60 డివిజన్ల బాధ్యతలను అప్పగిస్తూ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్ నేతృత్వంలో ఈ ముగ్గురు అధికారులు వార్డు ఆఫీసర్లు, సానిటరీఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, నగరంలో పారిశుధ్యంతోపాటు, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, తడి, పొడిచెత్త సేకరణ వంటి బాధ్యతలను అప్పగించారు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో పాలకవర్గ సభ్యులు లేక పోవడంతో వార్డు ఆఫీసర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేందుకు కలెక్టర్, కమిషనర్ తీసుకున్న ఈ ప్రత్యేక చర్యలు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరిగితే పారిశుధ్యపనులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.