World Literacy Day: పఠనంలో నేటితరం పిల్లలు ముందంజ
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:14 AM
అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు.
‘పుస్తకంతో నడక’లో సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకూ ర్యాలీ
చిక్కడపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ‘మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ ల్రైబరీ వరకూ నడక ర్యాలీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రారంభించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో జరిగిన సమావేశంలో సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పఠనం ద్వారా విజ్ఞాన సముపార్జనలో నేటి తరం పిల్లలు ఎంతో ముందున్నారని ఏ రూపంలో చదివినా అది పఠనమే అవుతుందని, నేటి తరం పిల్లలకు చాలా విషయ పరిజ్ఞానం ఉందని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక రీడింగ్ రూమ్‌లు కేటాయిస్తే.. గ్రంథాలయాల్లో వివిధ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతుందన్నారు.
ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, జర్నలిస్టు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు వసూలు చేసే ఆస్తిపన్నులోని 8ు లైబ్రరీ సెస్‌ను అప్పగిస్తే గ్రంథాలయాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ బాలాచారి, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, రచయిత్రి కొండవీటి సత్యవతినాళేశ్వరం శంకరం, రుక్మిణి, కందుకూరి రాము, భూపతి వెంకటేశ్వర్లు, కాసుల రవికుమార్,పాటు పలువురు సాహితీ వేత్తలు, రచయితలు పాల్గొన్నారు.