Khammam: నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:40 AM
బైక్ కొనివ్వలేదని ఓ కుమారుడు నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బైక్ కొనివ్వలేదని ఓ కుమారుడి ఘాతుకం
ఖమ్మం రూరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బైక్ కొనివ్వలేదని ఓ కుమారుడు నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళగూడెం గ్రామానికి చెందిన బండారు నాగయ్య, నాగలక్ష్మి దంపతుల కుమారుడు సతీశ్(20) 8వ తరగతి తర్వాత చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ కోసం గొడవ చేయగా తల్లిదండ్రులు కొనిచ్చారు. మళ్లీ బైక్ కోసం ఇబ్బంది పెట్టగా.. తాము కొనలేమని, ఏదైనా పనిచేసుకొని కొనుక్కోవాలని వారు తేల్చి చెప్పారు. ఈ నెల 13న కూడా బైక్ గురించి గొడవ జరగ్గా.. ‘‘ఈ రోజే మిమ్మల్ని ఇద్దరిని చంపుతాను’’ అని సతీశ్ బెదిరించాడు.
ఆ రోజు తల్లిదండ్రులతో పాటే నిద్రపోయిన అతడు అర్ధరాత్రి లేచి ఇంట్లో ఉన్న గొడ్డలితో గాఢ నిద్రలో ఉన్న తండ్రి నాగయ్య తలపై వేటు వేశాడు. ఇంతలోనే నాగలక్ష్మి భర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. సతీశ్ ఆమెపై కూడా దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చారు. అప్పటికే సతీశ్ గొడ్డలి అక్కడే వదిలేసి పరారయ్యాడు. నాగలక్ష్మి స్థానికుల సహయంతో భర్తను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.