Share News

American Visa Rules: పోస్టుతో పోస్టు గల్లంతు

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:11 AM

హైదరాబాద్‌కు చెందిన జగదీశ్‌ న్యూజెర్సీలోని ఓ ఐటీ సంస్థలో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు.

American Visa Rules: పోస్టుతో పోస్టు గల్లంతు

  • సోషల్‌ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు

  • ప్రభుత్వానికి, మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం

  • అమెరికా, యూకే, గల్ఫ్‌ దేశాల కొరడా

  • ఈ ఏడాది వెనక్కిపంపిన భారతీయుల సంఖ్య 3 వేలకు పైనే

  • ‘డిజిటల్‌’ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీల సేవలు

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన జగదీశ్‌ న్యూజెర్సీలోని ఓ ఐటీ సంస్థలో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలను భారీగా పెంచిన సమయంలో అతడు తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ‘భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం. ఈ నిర్ణయంతో ట్రంప్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది.. అగ్రరాజ్యం ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ పోస్టులో రాశాడు. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే అతడి హెచ్‌-1బి వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే అతడిని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపింది. భవిష్యత్తులోనూ అతడు అమెరికా రాకుండా దారులన్నీ మూసివేసింది. ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించి ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది 3వేలకు పైగా ఉంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు.. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల నుంచి అనేకమందిని వెనక్కి పంపేశారు. అక్కడి ప్రభుత్వం, ప్రజలు, ఇతర మతాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తొలగించడం ఏటా వందల సంఖ్యలో ఉండగా.. ఈసారి గతంలో ఎన్నడూలేనివిధంగా 3వేలకు పైగా భారతీయులను తొలగించారని హైదరాబాద్‌లో గత మూడు దశాబ్దాలుగా వీసా సేవలు అందిస్తున్న ఓ సీనియర్‌ కన్సల్‌టెంట్‌ తెలిపారు.


సోషల్‌ మీడియా ఖాతాల జల్లెడ

ఉన్నతవిద్య పేరుతో వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో ట్రంప్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేస్తే, వారి ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్‌ మీడియా ఖాతాలను జల్లెడ పడుతోంది. ‘డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్‌’తో మొత్తం చరిత్ర తవ్వితీస్తోంది. అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్లే ఉద్దేశం ఉందనీ గుర్తించినప్పటికీ.. సోషల్‌ మీడియాలో రాజకీయ, వివాదాస్పద, మతపరమైన అంశాలపై పోస్టులు చేసిఉన్నా, అలాంటివాటిని సమర్ధిస్తూ లైక్‌, కామెంట్లు చేసినా.. దరఖాస్తులను తిరస్కరిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసిన దేశం గురించి ఆన్‌లైన్‌లో శోధించిన వివరాలు, అక్కడుంటున్న స్నేహితులు, బంధువులతో చేసిన చాటింగ్‌లు, అక్కడి పర్యాటక ప్రాంతాలు, అక్కడి కంపెనీలు, పని సంస్కృతిపై ఆన్‌లైన్‌ వేదికలపై, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరచిన అభిప్రాయాలు.. ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికోసం దేశంలోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నాయి. వీసా కోసం దరఖాస్తు అందిన వెంటనే వారు పేర్కొన్న వివరాలను కన్సల్టెన్సీలకు అందించి సమాచారం రాబడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుడు తనతోపాటు తల్లిదండ్రుల ఫోన్‌, ఈ-మెయిల్‌ వివరాలనూ పేర్కొనాల్సి ఉంటుంది. వీటితో అనుసంధానమై ఉన్న సోషల్‌ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారినుంచి సానుకూల నివేదిక వస్తేనే వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. అభ్యంతరకర అంశాలుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే ముగిసిపోతోంది.


వీట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక వీసాల జారీలో అమెరికా కఠిన నిబంధనలను అమలుచేస్తుండగా.. యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు గల్ఫ్‌ దేశాలు కూడా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా చరిత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఉన్నతవిద్య, ఉపాధి, వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాకు ఎక్కువగా వెళ్లోంది భారతీయులే. 2023, 2024లో వరుసగా అమెరికా దాదాపు 10 లక్షల తాత్కాలిక (నాన్‌ ఇమిగ్రెంట్‌) వీసాలు జారీచేసింది. ఇందులో ఎక్కువగా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించిన ఎఫ్‌-1, ఉద్యోగం కోసం హెచ్‌-1బి, వ్యాపారం, పర్యాటకం కోసం బి-1, బి-2 వీసాలు, అక్కడి పౌరసత్వం పొందిన భారతీయుల కుటుంబసభ్యులు, దగ్గరి బందువులకు ఇచ్చే వీసాలున్నాయి. అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడ్డవారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులకు వీసాలు వెంటనే లభిస్తుండగా.. ఇప్పుడు ఇవి కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో మొత్తం స్టూడెంట్‌ వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ రేటు దాదాపు50శాతం ఉంటుండగా.. ఇప్పుడు 80శాతం వరకు ఉందని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. అలాగే వ్యాపార, పర్యాటక, ఇతర వీసాల తిరస్కరణ కూడా పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్‌లో మొత్తం అమెరికా వీసా దరఖాస్తుల్లో 60శాతానికి పైగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తమను దరఖాస్తులు సంప్రదించిన వెంటనే వీసా కన్సల్టెంట్లు ఇస్తున్న సలహా ఒక్కటే. దరఖాస్తుకు కనీసం 6నెలల ముందు ఫోన్‌, సిమ్‌ మార్చండి, ఈ-మెయిల్‌ కొత్తగా ప్రారంభించండి అని!! దీంతో గతంలో సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేసిన వారు.. విదేశీయానం కోసం ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. వాటిని తొలగించినా గుర్తించే అవకాశం ఉండటంతో.. కొత్త ఫోన్‌, కొత్త సిమ్‌, కొత్త ఈ-మెయిల్‌తో సామాజిక మాధ్యమంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అయితే వీసా కోసమే కొత్త అకౌంట్లు సృష్టించారన్న అనుమానంతోనూ దరఖాస్తులు రద్దవుతున్నాయి


ఈ వార్తలు కూడా చదవండి:

Public Gathering: బంగ్లాదేశ్‌ పార్లమెంటు ముట్టడి

American Politics: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో క్లింటన్‌ రాసలీలలు

Updated Date - Dec 21 , 2025 | 08:51 AM