Share News

Public Gathering: బంగ్లాదేశ్‌ పార్లమెంటు ముట్టడి

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:18 AM

భారత వ్యతిరేక రాడికల్‌ సంస్థ ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ(32) అంత్యక్రియలు శనివారం ముగిశాయి.

Public Gathering: బంగ్లాదేశ్‌ పార్లమెంటు ముట్టడి

  • పార్లమెంట్‌ ఆవరణలోనే హాదీ అంతిమ కార్యక్రమాల నిర్వహణ

  • హాజరైన లక్షలాది మంది ప్రజలు

ఢాకా, డిసెంబరు 20: భారత వ్యతిరేక రాడికల్‌ సంస్థ ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ(32) అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఢాకాలో ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయపడిన హాదీ.. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గురువారం మరణించాడు. హాదీ మరణవార్త తెలిసిన వెంటనే బంగ్లాలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. హాదీ మృతదేహం శుక్రవారం రాత్రి ఢాకా చేరుకోగా.. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఆవరణలో శనివారం అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్‌ యూనస్‌, సలహామండలిలోని ఇతర సభ్యులు, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌తోపాటు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో పార్లమెంట్‌ ఆవరణ జనసంద్రంగా మారింది. అలాగే, హాదీ మరణం నేపథ్యంలో శనివారం బంగ్లాదేశ్‌లో సంతాప దినం పాటించారు. కాగా, ఢాకా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న బంగ్లా జాతీయ కవి ఖాజీ నజ్రుల్‌ ఇస్లామ్‌ సమాధి పక్కనే హాదీ భౌతికకాయాన్ని ఖననం చేస్తామని ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

బంగ్లాలో ఇస్లామిక్‌ చట్టమే..

సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ చట్టాలే అమలవుతాయని, మనుషులు రూపొందించిన వ్యవస్థలు, చట్టాలు ఉండవని బంగ్లాదేశ్‌ జమాత్‌- ఈ- ఇస్లామి నేత ముజిబర్‌ రెహ్మాన్‌ ప్రకటించారు. ఢాకాలో శనివారం నిర్వహించిన ఓ ర్యాలీలో రెహ్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో ఇస్లామ్‌ను విస్మరించారని, ఖురాన్‌ ఆధారంగా ఒక్క చట్టాన్ని అమలు చేయలేదని ముజిబర్‌ పేర్కొన్నారు. దాని వల్లే దేశంలో ప్రస్తుతం అశాంతి, అవినీతి రాజ్యమేలుతున్నాయని తెలిపారు. ఇక, ఇస్లామిక్‌ చట్టాలను పాటించినప్పుడే బంగ్లా ప్రజల తలరాత మారుతుందని ఇదే ర్యాలీలో పాల్గొన్న జమాత్‌ పాలక మండలి సభ్యుడు అజ్రుల్‌ ఇస్లామ్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 06:19 AM