Anganwadi Centers: చిన్న గుడ్డు.. పెద్ద మోసం
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:59 AM
అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు అందించే గుడ్లలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి చూపుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, హాస్టళ్లకు గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్ల కక్కుర్తి
గుడ్డు బరువు 45-52 గ్రాములుండాలని నిబంధన
ఆయా కేంద్రాలకు చేరుతున్నవి 30-40 గ్రాముల్లోపే
తక్కువ ధరకు కొనుగోళ్లు
నెలలో 3 సార్లు రవాణా చేయాల్సి ఉండగా.. ఒకటి, రెండుసార్లతో సరిపెడుతున్న కాంట్రాక్టర్లు
ఎక్కువ రోజులు నిల్వ ఉండి పోవడంతో కుళ్లిపోతున్న గుడ్లు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు అందించే గుడ్లలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి చూపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ బరువు కలిగిన గుడ్లు సరఫరా చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన గుడ్డు బరువు 45-52 గ్రాములు ఉండాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే గుడ్డు బరువు 30-40గ్రాములు మించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 5.38కోట్ల గుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి జిల్లా కొనుగోలు కమిటీల(డీపీసీ) ఆధ్వర్యంలో ఏకీకృత టెండర్లు నిర్వహించగా.. ప్రతి జిల్లాలో ఒక కాంట్రాక్టరే అన్ని ప్రభుత్వ సంస్థలకు గుడ్లు అందిస్తున్నారు. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.5.50-రూ.6.30 చెల్లిస్తున్నా.. నిర్ణీత నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది చిన్న గుడ్డు కథాకమామీషు..
కోడి గుడ్డులో చిన్నది, పెద్దది అనే తేడా ఏంటి? కాంట్రాక్టర్లు చిన్న గుడ్లనే మాత్రమే ఎలా సేకరిస్తున్నారు? అంటే.. దీని వెనుక పెద్ద తతంగమే సాగుతోందన్న సమాధానం వస్తోంది. సాధారణంగా కోళ్లకు అందించే దాణా, వాటి రకాన్ని బట్టి 18-20 వారాల్లో గుడ్డు పెట్టే దశ మొదలవుతుంది. కోడి జీవిత కాలం 100వారాలనుకుంటే.. 500 రోజులపైగా గుడ్లు పెడుతుంది. 23-25 వారాల వయస్సున్న కోళ్లు పెట్టే గుడ్డు బరువు 30-40 గ్రాములలోపే ఉంటుంది. ఇలా ప్రతి కోడి దాదాపు 35 నుంచి 40 రోజుల పాటు చిన్నసైజులో ఉండే గుడ్లను పెడతాయి. పౌలీ్ట్ర పరిభాషలో వీటిని బుల్లెట్ గుడ్లుగా వ్యవహరిస్తారు. సాధారణ గుడ్డుతో పోల్చితే.. వీటి(ప్రీమెచ్యూర్‌ఎగ్)లో పోషకాలు తక్కువగా ఉంటాయి. కోడి పెరుగుతున్న కొద్దీ గుడ్డు బరువు 50-60 గ్రాములకు చేరుతుంది. డిమాండ్ దృష్ట్యా వీటిని ఢిల్లీ, ముంబైతోపాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో అంతగా డిమాండ్ లేని చిన్న సైజు గుడ్లను కాంట్రాక్టర్లు తక్కువ ధరకు సేకరించి.. గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లకు తరలిస్తున్నారు. జీవో ఎంస్ నంబర్ 16లో ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను పేర్కొన్నా.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అభ్యంతరం చెప్పినా.. బడా కాంట్రాక్టర్లు వారి మాటలు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు.. ప్రతి పది రోజులకు ఒకసారి చొప్పున నెలలో మూడు సార్లు ఆయా కేంద్రాలకు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా.. ఆ నిబంధనకూ కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి ప్రతి నెలా ఒకటి, రెండు విడతల్లోనే గుడ్లు సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో విద్యార్థులకు అందించే సమయానికి కొన్ని గుడ్లు పాడైపోతున్నాయి. దీంతో ఫుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. వాస్తవానికి అగ్‌మార్క్ ఉన్న గుడ్లనే సరఫరా చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. గుడ్ల బరువు, నాణ్యతను తనిఖీ చేయాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ, గురుకులాల సొసైటీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
చిన్న సైజు, పాడైపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళాశిశు సంక్షేమశాఖ కమిషనర్ శృతి ఓజా తెలిపారు. అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని.. ఇప్పటికే అధికారులను ఆదేశించామని వెల్లడించారు. వారిచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, నెలలో రెండు సార్లు మాత్రమే గుడ్లను సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు తమ దృష్టికి తెచ్చారని.. రానున్న రోజుల్లో మూడు సార్లు పంపేలా చర్యలు తీసుకుంటామని జేడీ అక్కేశ్వర్‌రావు తెలిపారు.