SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:01 AM
మంగళవారం సాయంత్రానికి బెల్టు పనిచేయడం ప్రారంభం కావడంతో సహాయక చర్యల్లో వేగం పుంజుకుంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 11 రోజులయినా మట్టి తరలింపు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

నేటి నుంచి రోజుకు 800 టన్నుల మట్టి బయటకు
గల్లంతైన వారి జాడ దొరికిందని పుకార్లు
నాగర్‌కర్నూల్/అచ్చంపేట/దోమలపెంట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రానికి బెల్టు పనిచేయడం ప్రారంభం కావడంతో సహాయక చర్యల్లో వేగం పుంజుకుంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 11 రోజులయినా మట్టి తరలింపు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. లోకో ట్రైన్ ద్వారా టిప్పర్ మట్టిని కూడా బయటకు తేలేకపోతున్నామని సహాయక బృందాలు ఆదివారం టన్నెల్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కన్వేయర్ బెల్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించడంతో పనులు చకచకా జరిగిపోయాయి. టన్నెల్‌లో 5 వేల టన్నుల మట్టి ఉందని అంచనా వేస్తుండగా బుధవారం నుంచి బెల్టు ద్వారా రోజుకు 800 టన్నుల మట్టిని బయటకు తేగలుగుతామని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. టన్నెల్‌లో గల్లంతైన వారి జాడ దొరికిందని మంగళవారం కూడా పుకార్లు షికార్లు చేశాయి. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయంటూ వార్తలు ప్రసారం కావడంతో ఉత్కంఠ నెలకొంది.