Shivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతోన్న హీరోయిన్లు
ABN , Publish Date - Dec 23 , 2025 | 02:02 PM
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ నిన్న రాత్రి ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ నిన్న రాత్రి ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సదరు ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ, మహిళలు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, శారీలోనే అందం ఉంటుందని అన్నారు.
హీరోయిన్లు తాము ఇష్టమొచ్చినట్టు దుస్తులు వేసుకుంటే అపఖ్యాతి పాలవుతారని, మిస్ యూనివర్స్ టైటిల్స్ శారీ ధరించిన వారే గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో అనుచిత కామెంట్లు సైతం చేశారు శివాజీ. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, చాలా మంది నెటిజన్లు శివాజీని తీవ్రంగా విమర్శించారు.
శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సింగర్ చిన్మయి ట్విట్టర్‌లో రియాక్ట్ అవుతూ, 'హీరోయిన్లను డిసిప్లిన్ చేయాలా? ఇండియన్ కల్చర్ అంటే నీవు శారీ వేసుకో' అంటూ సెటైర్ చేశారు.
నటి అనసూయ కూడా 'మై బాడీ, మై ఛాయిస్' అంటూ పోస్ట్ చేశారు. శివాజీ మాటలకు ఈవెంట్‌లో వచ్చిన రియాక్షన్ ఎలాగున్నా, నెట్టింట్లో మాత్రం భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళల డ్రెస్సింగ్ పై పురుషులు సలహాలు ఇవ్వడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మళ్లీ మహిళల ఛాయిస్, సాంప్రదాయం వర్సెస్ ఆధునికత అంశాలను రేకెత్తిస్తోంది. శివాజీ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.