Emotional Rakhi Moments: తమ్ముడూ.. నేనున్నాను రా
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:18 AM
ఐదేళ్ల తమ్ముడికి తీవ్ర అనారోగ్య సమస్య వస్తే.. ఇంటర్ చదువుతున్న ఆ అక్క విలవిల్లాడిపోయింది.
ఎముకమజ్జ దానం చేసి ప్రాణాలు నిలబెట్టిన అక్క
ఆస్పత్రిలోనే రాఖీ.. కిమ్స్ ఆస్పత్రిలో భావోద్వేగ ఘట్టం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఐదేళ్ల తమ్ముడికి తీవ్ర అనారోగ్య సమస్య వస్తే.. ఇంటర్ చదువుతున్న ఆ అక్క విలవిల్లాడిపోయింది. ఎముక మజ్జ దానం చేసి తమ్ముడికి ప్రాణదానం చేసింది. పూర్తిగా కోలుకున్న ఆ చిన్నారికి ఆస్పత్రిలోనే రాఖీ కట్టి ‘నీకు నేను రక్ష...’ అనే పండుగ సందేశాన్ని నిజం చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన హస్మిత అనే బాలిక, ఎల్‌కేజీ చదువుతున్న తన తమ్ముడైన భరత్ రాంసింగ్ విషయంలో చాటుకున్న అనురాగమిది. కిమ్స్ ఆస్పత్రిలో భరత్ రాంసింగ్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. శనివారం ఆస్పత్రికొచ్చిన హస్మిత వైద్యుల సమక్షంలోనే సోదరుడికి రాఖీ కట్టింది. ఇక.. మహబూబాద్ జిల్లా కేసముద్రంలో పూలమ్మ, జయమ్మ, దేవ, నాగమ్మ నీలమ్మ అనే మహిళలు తమ సోదరుడికి ‘చివరిసారిగా’ రాఖీ కడుతూ కన్నీళ్లపర్యంతమయ్యారు. వీరి తమ్ముడు యాకన్న(50) అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన చేతికి ఐదుగురు సోదరీమణులు రాఖీలు కట్టి కడసారి వీడ్కోలు పలికారు. రాఖీ పండుగ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయిబాబా(19) అక్కతో రాఖీ కట్టుకునేందుకు నిజామాబాద్‌లోని గాజులపేట్‌కు స్కూటీపై వెళ్లాడు. గ్రామానికి తిరిగివస్తుండగా ఓ కంటెయినర్‌ను స్కూటీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో ఓ మహిళ అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికొచ్చి గుండెపోటుతో మృతిచెందింది. మధిర మండలం ఆత్మకూరుకు చెందిన హుస్సేన్‌బీ (52) ఇద్దరు అన్నలకు రాఖీ కట్టేందుకు కలకొడిమకొచ్చింది. పెద్దన్నకు రాఖీ కట్టి.. చిన్నన్న ఇంటికొచ్చి అతడికి రాఖీ కడుతూ కుప్పకూలి మృతిచెందింది.