Smita Sabharwal: చైల్డ్ కేర్ పేరిట స్మితా సబర్వాల్ దీర్ఘకాలిక సెలవు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:31 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జనవరి 31 వరకూ చైల్డ్ కేర్ లీవ్ పేరిట ఆమె 6 నెలల సెలవు పెట్టారని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జనవరి 31 వరకూ చైల్డ్ కేర్ లీవ్ పేరిట ఆమె 6 నెలల సెలవు పెట్టారని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఆమె పెట్టుకున్న దరఖాస్తును జూలై 19న ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ బాధ్యతలను సెర్ప్ అదనపు సీఈఓ పీ కాత్యాయనీ దేవికి అప్పగించింది. కాగా, తాను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు స్మితా సబర్వాల్ చెప్పారు. ‘కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ప్రశాంతమైన కాలాలు మనతో బిగ్గరగా మాట్లాడతాయి. కొన్ని నెలలుగా వెన్నెముక సమస్య నా ప్రపంచాన్ని కుదిపేసింది.
చాలా బాధతో, నెమ్మదిగా కోలుకుంటున్నా. ఈ సమస్యను అధిగమిస్తా’ అని పేర్కొంటూ గురువారం.. ఓ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్న వీడియోనూ పోస్టు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల తొలగింపు సమయంలో ఏఐ ఆధారిత నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఆమెకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన స్మితా సబర్వాల్.. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్లే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలుస్తోంది.