Telangana High Court: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి ఊరట
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:09 AM
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆమెను మళ్లీ నిందితురాలిగా చేరుస్తూ ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గతంలో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని నిందితుల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శ్రీలక్ష్మి పేరు తొలగించడాన్ని హైకోర్టు పునఃపరిశీలించాలని సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు మళ్లీ ఆమె విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఈ నెల 12న శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
శుక్రవారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో శ్రీలక్ష్మిని నిందితుల జాబితా నుంచి తొలగించిన హైకోర్టే.. మళ్లీ నిందితురాలిగా చేరుస్తూ తీర్పు ఇచ్చిందా అని ప్రశ్నించింది. ఆ తీర్పుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతోపాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 28కి వాయిదా వేసింది.