Srushti Scam: సృష్టి కేసులో మరో నలుగురి కోసం గాలింపు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:46 AM
సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మోసం కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు గోపాలపురం పోలీసులు..
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మోసం కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు గోపాలపురం పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతోపాటు.. మొత్తం 25 మంది అరెస్టయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, టెక్నీషియన్లు, ఏజెంట్లు, చిన్నారుల అక్రమ రవాణా ముఠాల సభ్యులున్నారు. నమ్రత ముఠాలో కీలకంగా వ్యవహరించిన మరో నలుగురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరికోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఈ కేసులో.. ఈ నలుగురు కీలకమని, వారి వాంగ్మూలం కీలకమనిదర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కాగా.. నమ్రత, ఆమె కుమారుడు జయంత్‌కృష్ణ, ఇతర నిందితులు బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే.. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా దర్యాప్తు అధికారులు బలమైన కౌంటర్ దాఖలు చేశారు. నిందితులు బెయిల్‌పై బయటకు వస్తే.. సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదముందని కోర్టుకు విన్నవించారు. పోలీసుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితులకు బెయిల్‌ను నిరాకరించింది.