నేటినుంచి సాగరమాత తిరునాళ్లు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:12 AM
నాగార్జునసాగర్ దక్షిణ విజయపురి(రైట్‌బ్యాంక్) వద్ద కృష్ణానది తీరంలో సాగరమాత పుణ్యక్షేత్రం కొలువై ఉంది.

మూడు రోజుల పాటు ఉత్సవాలు
విద్యుత్ దీపాలతో సాగర్‌మాత దేవాలయం ముస్తాబు
అధిక సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
నాగార్జునసాగర్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ దక్షిణ విజయపురి(రైట్‌బ్యాంక్) వద్ద కృష్ణానది తీరంలో సాగరమాత పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఎలాంటి పాశ్చత్య పోకడలు లేని అచ్చమైన భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న సాగరమాత దేవాలయాన్ని 1977లో నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేవాలయ నిర్మాణం పూరైన మార్చి 7, 8, 9వ తేదీల్లో ప్రతి సంవత్సరం తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తారు. 1980లో మారంరెడ్డి ఇన్నయ్య ఆధ్వర్యంలో దేవాల యం, దాని విశిష్టతను ప్రచారం చేశారు. 1996లో బిషప్ గాలి బాలీ ఆధ్వర్యంలో నూతన దేవాలయం(చర్చీ)ని నిర్మించారు. 2010 అక్టోబరు 23వ తేదీన 18 పరిశుద్ధ జపమాల క్షేత్రాలను అప్పటి గుంటూరు పిఠాధిపతులు గాలీ బాలీ, అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మాతను దర్శించుకుంటారు. జపమాల క్షేత్రంలో ప్రార్థనలు చేస్తారు. హిందూ దేవాలయాల మాదిరిగానే తలనీలాలు సమర్పించడం, కొబ్బరి కాయలు కొడతారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు ఐదు లక్షల మంది భక్తులు తరలివ స్తారని విచారణ గురువులు(రెక్టర్) పామిశెట్టి జోసప్ బాలసాగర్ తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30గంటలకు నవ దిన(తొమ్మిది రోజులు)జపములు జరుగుతాయని తెలిపారు.
సౌకర్యాలు: ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలకు దేవాలయం ఆధ్వర్యంలో నిర్మించిన అతిథి గృహంలో మొత్తం 20 గదులు ఉన్నాయి. రోజుకు రూ.200 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయం అవరణలో నూతనంగా అన్ని హంగులతో నిర్మించిన మాతా సరోవర్‌లో కూడా గదులు అద్దెకు ఇవ్వనున్నట్లు నిర్వహకులు వీరారెడ్డి తెలిపారు. దీనిలో రోజుకు ఏసీ గదికి రూ.1,400, నాన్ ఏసీకి రూ.800 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
బస్సు సౌకర్యం
ఇక్కడికి చేరుకోవడానికి హైదరాబాద్, నల్లగొండ నుంచి మాచర్లకు వెళ్లే బస్సులు రైట్‌బ్యాంకు ఎక్స్ రోడ్డు(చెక్‌పోస్టు) వద్ద ఆగుతాయి. అక్కడ నుంచి ఆటోల్లో సాగరమాత దేవాలయానికి చేరుకోవచ్చు.