Heavy Rainfall Floods Hyderabad: హైదరాబాద్‌లో కుంభవృష్టి
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:12 AM
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్లనైతే కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా, 13, 14, 15 తేదీల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు, ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మహానగరంలోని చాలా ప్రాంతాల్లో దంచికొట్టిన వాన.. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం
రాకపోకలకు తీవ్ర అంతరాయం
13, 14, 15 తేదీల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు
ఆది, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను శనివారం రాత్రి వర్షం ముంచెత్తింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, తార్నాక, అబిడ్స్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి 11 గంటల సమయానికి అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 13..5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నాంపల్లి-బేగంబజార్ ప్రాంతంలో 12..4 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షానికి యూసు్‌ఫగూడ కృష్ణానగర్ ప్రాంతంలో వరద పోటెత్తెంది. వరద నీటిలో చిక్కుకున్న వారిని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాయి. మలక్‌పేట రైల్వే వంతెన వద్ద పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది

దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని వాగులు పొంగి పొర్లగా పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు వరద ముంపునకు గురయ్యాయి. నారాయణపేట జిల్లాలోని సంగంబండ రిజర్వాయర్ రెండు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. గద్వాలలో ఓ ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండల్లాలో కూడా పంటనష్టం సంభవించింది. మరోపక్క, నారాయణపేట జిల్లా మక్తల్‌లో శనివారం 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని శనివారం ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక ఆది, సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

నేడు సాగర్ గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఆదివారం ఉదయం 6గంటలకు ఎత్తనున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లిఖార్జున్‌రావు శనివారం ప్రకటించారు. రెండు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. ఈ నీటి సంవత్సరంలో (ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు) సాగర్ గేట్లు ఎత్తడం ఇది రెండోసారి కావడం విశేషం. సాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రానికి 589.70 అడుగులుగా ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 183.41 టీఎంసీలు నిల్వ ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఇందులో భీమా నది నుంచి 22 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మరోపక్క, సింగూరు ప్రాజెక్టు వద్ద శనివారానికి నీటిమట్టం 21.223 టీఎంసీలకు చేరింది.