Share News

Road Accident: నెత్తురోడిన రోడ్లు

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:08 AM

ఒకేరోజు నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణంపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.

Road Accident: నెత్తురోడిన రోడ్లు

  • ఒకేరోజు 4 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు

  • రంగారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఘటనలు

  • నెత్తురోడిన రహదారులు

  • వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి.. చికిత్స పొందుతూ

  • ఇద్దరి మృతి.. తుక్కుగూడ, జల్‌పల్లి వద్ద ఘటనలు

చేవెళ్ల, సిరిసిల్ల, యాచారం, జిన్నారం, పహాడిషరీఫ్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఒకేరోజు నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణంపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. ఆ పిల్లల్లో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కావడం మరో విషాదం. చేవెళ్ల పరిధిలోని మల్కాపూర్‌ గేట్‌ వద్ద గురువారం అర్ధరాత్రి దాటాక ఓ వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం పగడియాల్‌కు చెందిన వడ్ల రవి కుమార్‌ చారి (27), సయ్యద్‌ సల్మాన్‌ (27) స్నేహితులు. పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమ్మను పరామర్శించేందుకు సల్మాన్‌ను వెంటబెట్టుకొని రవి గురువారం స్కూటీపై బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు.


సిరిసిల్ల జిల్లా చందుర్తి తిమ్మాపూర్‌కు చెందిన పిట్టల నీరజ.. తన ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకొని ఇటీవల కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. గురువారం తిరిగివస్తూ సిరిసిల్లలో తెలిసిన వ్యక్తి ముప్పారపు అజేరియా (37) కనిపించడం, బైక్‌పై తమ ఊరికే వెళుతండటంతో పెద్ద కూతురు సాన్విత (8)ను అతడి బైక్‌ ఎక్కించింది. చిన్న కూతురితో కలిసి తాను ఆటో ఎక్కింది. అయితే అజేరియా, సాన్విత ప్రయాణిస్తున్న బైక్‌.. సిరిసిల్ల బైపాస్‌రోడ్డు కన్వెన్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అజేరియా, సాన్విక మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం ముద్వేన్‌కు చెందిన తలాతి హరిబాబు, తాతి స్వామి అన్నదమ్ములు. నల్లగొండ జిల్లా చండూర్‌లోని ఓ విందులో పాల్గొనేందుకు స్వామి తన కుమారులు హర్దిక్‌ రామ్‌ (9), సాత్విక్‌ రామ్‌ (11)తో పాటు సోదరుడి కుమారుడు అభిరామ్‌ (8)లను బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. బైక్‌ యాచారం మండలం తమ్మలోనిగేట్‌ వద్దకు రాగానే.. ఓ ట్రాక్టర్‌ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో హార్దిక్‌రామ్‌, అభిరామ్‌ మృతిచెందారు. స్వామి, సాత్విక్‌రామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం గన్‌పూర్‌కు చెందిన దొసర్ల అంకన్న (46), ఉట్నూరు మండలం నాగ్‌పూర్‌కు చెందిన సిడాల మోతీరామ్‌ (50) బైక్‌పై గురువారం జిన్నారం వెళ్తుండగా.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం మొర్రిగూడ వద్ద కారు ఢీకొట్టింది. ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు. ఇక.. బుధవారం రాత్రి హైదరాబాద్‌ తుక్కుగూడ అయ్యప్ప ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన కుక్కల శ్రీకాంత్‌ (20) గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. చాంద్రాయణగుట్టకు చెందిన మహేశ్‌ ఈనెల 19న బైక్‌పై వెళుతూ జల్‌పల్లి గేటు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.

Updated Date - Oct 24 , 2025 | 05:08 AM