Hyderabad: బడిపిల్లల్లో పెరుగుతున్న కిడ్నీ స్టోన్ కేసులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:13 AM
10-17 ఏళ్ల పిల్లల్లో కిడ్నీ స్టోన్ కేసులు పెరుగుతున్నాయి. శీతాకాలంతో పోలిస్తే వేసవిలో ఈ కేసులు రెండున్నర రెట్లు అధికమైయ్యాయి, నీళ్ల లోపం మరియు జంక్ ఫుడ్స్ కారణంగా ఈ సమస్య మరింత పెరిగిందని వైద్యులు చెప్తున్నారు
శీతాకాలంతో పోలిస్తే వేసవిలో రెండున్నర రెట్లు అధికం
ఏఐఎన్‌యూ వైద్యుల పరిశీలనలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్న కేసులు ఇటీవలి కాలంలో 10-17 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఏఐఎన్‌యూ) వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, జంక్ ఫుడ్, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం దీనికి కారణాలుగా వైద్యులు చెప్పారు. రాష్ట్రంలో కిడ్నీ స్టోన్ కేసులు శీతాకాలంతో పోలిస్తే ఈ వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి రెండున్నర రెట్లు పెరిగాయన్నారు. ఎండాకాలంలో తగినన్ని నీళ్లు తాగకపోవడంతో కిడ్నీల్లో ఇబ్బందులు పెరుగుతున్నట్లు గుర్తించామని వారు వివరించారు. రోజుకు సుమారు 300-400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో ఏఐఎన్‌యూ ఆస్పత్రికి వస్తున్నట్లు చెప్పారు. ఉప్పు ఎక్కువగా తినడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీల్లో రాళ్ల సమస్య పెరుగుతుందన్నారు.