Share News

Rising HIV Cases: ఐటీలో హెచ్‌ఐవీ బగ్‌!

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:44 AM

నిత్య నూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్‌ఐవీ బగ్‌ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందినవారిలో హెచ్‌ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ...

Rising HIV Cases: ఐటీలో హెచ్‌ఐవీ బగ్‌!
HIV in IT Sector

  • ఆ రంగానికి చెందినవారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్‌ కేసులు

  • విచ్చలవిడి వీకెండ్‌ పార్టీలు, డ్రగ్స్‌,మత్తు ఇంజెక్షన్ల వినియోగంతో సమస్య

  • జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నిత్య నూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్‌ఐవీ బగ్‌ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందినవారిలో హెచ్‌ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోందని ‘జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (న్యాకో)’ తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ రంగానికి సంబంధించి హెచ్‌ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్‌ఐవీ వ్యాప్తి తగ్గినా.. ఐటీ రంగంతోపాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని వెల్లడించింది. ఇక తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే ఈసారి హెచ్‌ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీశాక్‌) వెల్లడించింది.2030 నాటికి ఎయిడ్స్‌ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది.


హెచ్‌ఐవీ విస్తృతికి ఏమిటీ కారణం?

ఐటీ రంగంలో హెచ్‌ఐవీ వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడటం కారణమవుతోందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్‌, మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్స్‌ ఇంజెక్షన్లను మరొకరు వాడటం వంటివి హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణం అవుతున్నాయని అంటున్నాయి. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్‌లు వాడేవారని.. కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్‌ తరహా తక్షణ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీల్లో హెచ్‌ఐవీపై అవగాహన తక్కువగా ఉండటం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతుండటం వంటివి వ్యాప్తికి కారణమని వివరిస్తున్నాయి. వారి జీవనశైలి కారణంగా రిస్క్‌ పీపుల్‌ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి.


రాష్ట్రంలో తగ్గిన వైరస్‌ వ్యాప్తి రేటు

తెలంగాణలో హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు 2023లో 0.44శాతం ఉండగా.. 2025లో 0.41శాతానికి తగ్గిందని టీశాక్‌ తెలిపింది. ఎయిడ్స్‌ సంబంధిత మరణాలలో 80శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి 8,21,508 మందిని స్ర్కీనింగ్‌ చేయగా.. కొత్తగా 5,517 మందిని పాజిటివ్‌గా గుర్తించామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,38,290 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించి ఏఆర్‌టీ చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించాయి. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా, మందులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపాయి. ఇక 2023-24లో 1,977మంది హెచ్‌ఐవీతో మృతిచెందగా, 2024-25లో 193మరణాలే నమోదైనట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 22, ప్రైవేటులో 8కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు కౌన్సెలింగ్‌, ఔషధాలు, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 34,656మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పింఛన్లు అందుతుండగా, ఈ ఏడాది 45,374 మంది పింఛన్‌ తీసుకుంటున్నట్టు టీశాక్‌ అధికారులు తెలిపారు.


ప్రైవేటుతో పాటు హోమియో, ఆయుర్వేద ఆస్పత్రుల్లో చికిత్సలు

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులను గుర్తించారు. దానికితోడు ప్రైవేటు ఆస్పత్రులు, హోమియో, ఆయుర్వేద ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ చికిత్స పొందుతున్న వారి వివరాలను కూడా టీశాక్‌ సేకరించింది. ప్రైవేటులో సుమారు 5,600 మంది, హోమియోపతి కేంద్రాల్లో మరో 5 వేల మంది చికిత్స పొందుతున్నట్టు గుర్తించింది. దీంతో మొత్తం 1.38 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితుల వివరాలను న్యాక్‌ డేటాకు లింక్‌ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Tamil Nadu Crime Incident: భార్యను చంపి వాట్సాప్‌లో 'సెల్ఫీ' పోస్ట్ చేసిన భర్త

Parliament Winter Session 2025: లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా

Updated Date - Dec 01 , 2025 | 11:53 AM