Share News

Rice Millers Stockpile: 5 సీజన్లు.. కోటి మెట్రిక్‌ టన్నులు

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:20 AM

రైస్‌మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు భారీగా పేరుకపోయాయి. ఐదు సీజన్లకు సంబంధించిన కోటి టన్నుల

Rice Millers Stockpile: 5 సీజన్లు.. కోటి మెట్రిక్‌ టన్నులు

  • రైస్‌మిల్లర్ల వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలు.. బియ్యంగా వసూలైతే 25 వేల కోట్ల ఆదాయం

  • సామర్థ్యానికి మించి మిల్లర్లకు వడ్ల కేటాయింపులు

  • రూ.50 వేల కోట్లు దాటిన పౌరసరఫరాల సంస్థ అప్పు

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు భారీగా పేరుకపోయాయి. ఐదు సీజన్లకు సంబంధించిన కోటి టన్నుల ధాన్యం రైస్‌మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ధాన్యం తీసుకున్న మూడు నెలల్లోగా బియ్యం అప్పగించాల్సిన రైస్‌మిల్లర్లు.. ఏళ్లతరబడి బియ్యం అప్పజెప్పకుండా మొండికేస్తున్నారు. ఐదు సీజన్లలో కలిపి సుమారు రూ.25 వేల కోట్ల విలువైన బియ్యం రైస్‌మిల్లర్ల వద్దే బ్లాక్‌ అయిపోయింది. సకాలంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) అప్పగించకపోవటంతో పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన రూ.25 వేల కోట్ల ఆదాయం నిలిచిపోయింది. ఒకవైపు పాత బకాయిలు వసూలు కాకపోవటం, మరోవైపు కార్పొరేషన్‌ అప్పు రూ.50 వేల కోట్లు దాటిపోవడం చర్చనీయాంశంగా మారింది. రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలుచేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం అప్పగిస్తుంది. రైస్‌మిల్లర్లు ధాన్యం తీసుకున్న వెంటనే మిల్లింగ్‌ ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు బియ్యం లోడ్‌ చేసి.. ఎఫ్‌సీఐకిగానీ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు గానీ అప్పగించాలి. కానీ కొన్నేళ్లుగా ఈ గొలుసు వ్యవస్థ దెబ్బతింది. ఫలితంగా ప్రభుత్వానికి భారీ నష్టం కలుగుతోంది. ధాన్యం సేకరించే సమయంలో ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇస్తే.. బ్యాంకుల నుంచి సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అప్పు తెచ్చి రైతులకు డబ్బులు చెల్లిస్తోంది. మిల్లర్లు సీఎంఆర్‌ అప్పగిస్తేనే ఎఫ్‌సీఐ నుంచి పేమెంట్స్‌ వస్తాయి. అయితే సకాలంలో సీఎంఆర్‌ డెలివరీ చేయకపోవటంతో ఎఫ్‌సీఐ నుంచి డబ్బులు రావటంలేదు. దీంతో మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు, బియ్యం బకాయిలు పెరిగిపోతుండగా.. బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ విపరీతంగా పెరిగిపోతోంది.


రైస్‌మిల్లుల్లో కోటి టన్నుల ధాన్యం

ఎఫ్‌సీఐ లెక్కల (ప్రొవిజనల్‌ కాస్టింగ్‌ షీట్‌) ప్రకారం క్వింటా బియ్యానికి రూ.3,600 ధర వస్తుంది. అంటే టన్నుకు రూ. 36 వేలు వస్తాయి. 2023- 24లో రెండు సీజన్లలో కలిపి 8.25 లక్షల టన్నుల ధాన్యం, 2024-25 వానాకాలంలో 18 లక్షల టన్నులు, యాసంగిలో 56 లక్షల టన్నుల ధాన్యం కలిపి కోటి మెట్రిక్‌ టన్నుల పైచిలుకు ధాన్యం రైస్‌మిల్లుల్లో ఉండిపోయింది. దీనిని మిల్లింగ్‌చేస్తే 68.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తుంది. ఈ బియ్యం విలువ రూ. 24,660 కోట్లు ఉంటుంది.

కేటాయింపులు సరే... రికవరీ ఏది?

ధాన్యం కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి కేటాయింపులు చేస్తున్నారు. ఇందులో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, కార్పొరేషన్‌ మేనేజర్లు, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల ప్రమేయం ఉంది. బ్లాక్‌ లిస్టులో ఉన్న రైస్‌మిల్లులకూ ధాన్యం అప్పగిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నడవకుండా మూతపడిన రైస్‌మిల్లులకు కూడా ధాన్యం ఇచ్చారు. ఽఅధికారులు, రైస్‌మిల్లర్లు మిలాఖత్‌ అయిపోయి... టన్నుకు కొంత రేటు కట్టుకొని అడ్డగోలుగా ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో నిర్మాణం కూడా పూర్తికాని రెండు రైస్‌మిల్లులకు 50 వేల నుంచి 60 వేల క్వింటాళ్ల ధాన్యం ఇచ్చేశారు. సూర్యాపేటలో రెండు మిల్లులు రెండేళ్లుగా బియ్యం అప్పగించకపోయినా రూ.100 కోట్లకు పైగా బకాయిలున్నా మళ్లీ గడిచిన యాసంగి సీజన్‌లో ధాన్యం కేటాయింపులు చేశారు.

Updated Date - Aug 11 , 2025 | 04:20 AM