Congress Party Strategy: కాంగ్రెస్ మేధో బృందంలో రేవంత్
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:16 AM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పరపతి అమాంతం పెరిగిపోయింది. ఓవైపు బిహార్‌లో తాము ఎంత ఉధృతంగా ప్రచారం చేసినా..
చోటు కల్పించే యోచనలో అధిష్ఠానం!
దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి చర్యలపై..తెలంగాణ సీఎంతో చర్చించిన ఢిల్లీ నేతలు తెలంగాణను బీజేపీ వశం కాకుండా రేవంత్ చూసుకోగలరన్న ధీమా
న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పరపతి అమాంతం పెరిగిపోయింది. ఓవైపు బిహార్‌లో తాము ఎంత ఉధృతంగా ప్రచారం చేసినా.. కేవలం ఆరు సీట్లకే పరిమితం కావడం, అదే సమయంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని రేవంత్ గెలిపించుకోవడంతో ఆయన పట్ల హైకమాండ్‌కు విశ్వాసం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేధో బృందంలో రేవంత్‌కు చోటు కల్పించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. బిహార్‌లో పరాజయం, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో తీవ్రతరమవుతోంది. అంతేకాకుండా.. ఇప్పటికే అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలను కూడా వశం చేసుకునేందుకు కమలం పార్టీ పథకం సిద్ధం చేసి ఉంటుందన్న భయం వారిలో నెలకొంది. నిజానికి బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా గఠ్‌బంధన్ విజయం సాధిస్తే కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి తెలంగాణ, కర్ణాటకలపై పడేది. కానీ, బిహార్ ఓటమితో హైకమాండ్ డీలా పడింది. మరోవైపు జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎ్‌సను సిటింగ్ స్థానంలో.. ఎమ్మెల్యే మరణం తర్వాత సానుభూతి పవనాలను కూడా అధిగమించి కాంగ్రెస్ విజయం సాధించింది.
రేవంత్‌కు ఇక పూర్తి స్వేచ్ఛ..! రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులందరినీ ఏకం చేసి, చివరి పది రోజుల్లో తగిన వ్యూహరచన, సంఘటిత కార్యాచరణతో జూబ్లీహిల్స్‌లో పార్టీని గెలిపించడంతో సీఎం రేవంత్‌కు భవిష్యత్తు ఎన్నికలపై పూర్తి స్వేచ్ఛనిచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. డీసీసీ అధ్యక్షుల నియామకం నుంచి స్థానిక ఎన్నికల్లో గెలుపు వరకు రేవంత్ అవసరమైన నాయకత్వం అందించగలరని వారు భావిస్తున్నారు. ‘‘రేవంత్.. జూబ్లీహిల్స్‌లో మాదిరి పార్టీ నాయకులందరినీ ఏకతాటిన నడపండి. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ బలోపేతమయ్యేందుకు అవకాశం ఇవ్వకండి’’ అని శుక్రవారం ఢిల్లీలోని సీనియర్ నేత ఒకరు రేవంత్‌కు చెప్పినట్లు సమాచారం. బిహార్‌లో పార్టీ రాజకీయాలతో సంబంధంలేని కృష్ణ అల్లవారు అనే వ్యక్తికి అభ్యర్థుల ఎంపిక నుంచి పొత్తు వరకు బాధ్యతలు అప్పజెప్పడంతో జరిగిన నష్టాన్ని రాహుల్‌గాంధీ గుర్తించారని తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న కొందరు నేతలు.. కిందిస్థాయి కార్యకర్తలు, నేతలతో సంబంధాలు పెట్టుకోకపోవడం, ముఖ్యమంత్రిని కూడా వేచి చూసేలా చేయడం, మీడియాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోకపోవడంపై కూడా ఫిర్యాదులందాయి. దీంతో ఢిల్లీలో అలాంటివారిని తప్పించి, అన్ని వర్గాలతో సంబంధాలు నెరిపేవారు, బూత్ స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించేవారిని నియమించాలన్న చర్చ జరుగుతోంది. అమిత్ షా లాంటి నేత లేనందునే.. బిహార్‌లో ఓవైపు మోదీ-నితీశ్ ప్రచారం ఉవ్వెత్తున సాగుతుండగా, మరోవైపు అమిత్ షా 19 రోజులపాటు అక్కడి నుంచి కదలకుండా అనుక్షణం పరిస్థితులను సమీక్షించారు. ఎన్డీఏలోని తిరుగుబాటు అభ్యర్థులను శాంతింపజేయడంతోపాటు మహా గఠ్‌బంధన్ అభ్యర్థుల ఓట్లను చీల్చే వ్యూహాలు రచించారు.
ఎస్‌ఐఆర్, ఓట్ల చోరీ వంటి కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో అవలంబించిన వ్యూహాన్నే బిహార్‌లో ప్రయోగించి అమిత్‌షా బీజేపీలో తిరుగులేని వ్యూహకర్తగా నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌లో అలాంటివారు లేకపోవడం, ఉన్నవారు కూడా కలిసికట్టుగా పనిచేయకపోవడం, కృష్ణ అల్లవారు లాంటి బయటి నుంచి వచ్చినవారు పెత్తనం చెలాయించడం, రాహుల్‌కు తప్ప ఎవరికీ అందనంత ఎత్తులో కేసీ వేణుగోపాల్ ఉండడం వల్ల కాంగ్రెస్ తరఫున వ్యూహకర్తలు లేకపోయారు. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి చేసిన టీమ్ వర్క్, జూబ్లీహిల్స్ లాంటి ఉప ఎన్నికలో కూడా రాత్రింబవళ్లు పనిచేయడంపై అధిష్ఠానంలో చర్చ జరుగుతోంది. కర్ణాటకలో సిద్దరామయ్య, శివకుమార్ మధ్య చిచ్చు.. పార్టీలో తలనొప్పి తెచ్చిపెడుతుండగా, తెలంగాణలో రేవంత్.. ఉత్తమ్, భట్టి, మహేశ్‌గౌడ్ తదితర నేతలందర్నీ కలుపుకొనిపోయి పనిచేయడం ఢిల్లీ పెద్దలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో బలోపేతం కాకుండా చూసుకోవడంతోపాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఢిల్లీ నేతలు రేవంత్ తో ఇప్పటికే చర్చించారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆయనను తమ థింక్ ట్యాంక్‌లో భాగం చే స్తారని అన్నారు.