Share News

SLBC Tunnel: మొరాయించిన కన్వేయర్‌ బెల్ట్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:08 AM

అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మంగళవారం కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణతో సహాయక చర్యలు వేగవంతమవుతాయని అందరూ ఆశించారు. అయితే, సాంకేతిక సమస్యలతో మంగళవారం రాత్రే కన్వేయర్‌ బెల్టు ఆగిపోయింది.

SLBC Tunnel: మొరాయించిన కన్వేయర్‌ బెల్ట్‌

సొరంగంలో సహాయక చర్యలకు విఘాతం

12 రోజులు కావస్తున్నా దొరకని కార్మికుల జాడ

ఢిల్లీ నుంచి వచ్చిన సిస్మాలజీ నిపుణుల బృందం

నాగర్‌కర్నూల్‌/దోమలపెంట/అల్వాల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి.. 12 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లభించడం లేదు. కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా... అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మంగళవారం కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణతో సహాయక చర్యలు వేగవంతమవుతాయని అందరూ ఆశించారు. అయితే, సాంకేతిక సమస్యలతో మంగళవారం రాత్రే కన్వేయర్‌ బెల్టు ఆగిపోయింది. దీంతో సహాయక చర్యలకు మళ్లీ విఘాతం ఏర్పడింది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అధికంగా వస్తున్న ఊట నీరు, ఊడి పడుతున్న మట్టి దిబ్బల కారణంగా సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ప్రమాదం జరిగి 12 రోజులు అవుతున్న నేపథ్యంలో కార్మికుల సురక్షితంగా ఉన్నారా? లేదా? అనే అంశంలో ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. మరోవైపు.. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన సిస్మాలజీ విభాగానికి చెందిన నిపుణులు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. సొరంగం పైభాగంలో మట్టి పొరలు, వాటి స్వభావం, మట్టి తొలగించడం వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? పైకప్పు మళ్లీ కూలే పరిస్థితులున్నాయా? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బృందం నివేదిక అందించనుంది. కాగా, సొరంగం వద్ద సహాయక చర్యల్లో ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌(ఈటీఎఫ్‌) నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని రక్షణశాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం రాత్రి సొరంగంలోకి వెళ్లిన నిపుణులు బుధవారం మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి పనులను పర్యవేక్షించినట్లు తెలిపారు.

Updated Date - Mar 06 , 2025 | 06:08 AM