Share News

శాస్త్రోక్తంగా నిత్య పూజలు

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:36 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు గురువారం పాంచారాత్రగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా నిత్య పూజలు
నిత్యకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

భువనగిరి అర్బన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు గురువారం పాంచారాత్రగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్స వం నిర్వహించారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విశ్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు కొనసాగింది. పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకస్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.14,99,455ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Jan 24 , 2025 | 12:36 AM