Share News

Minister Uttam kumar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - May 14 , 2025 | 03:59 AM

తెలంగాణలో రబీ సీజన్‌లో 43 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై హరీశ్ రావు చేసిన విమర్శలు అసత్యమని స్పష్టం చేశారు.

Minister Uttam kumar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

  • ఇప్పటికే 43 లక్షల టన్నుల ధాన్యం సేకరణ: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 43 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌ (2024-25)లో ధాన్యం కొనుగోలు గణనీయంగా పెరిగిందని వివరించారు. ఽ ఈ మేరకు మంత్రి మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 2024-25 రబీ సీజన్‌లో మే 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం 43.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డును సృష్టించిందని తెలిపారు. వానాకాలం సీజన్‌లో 153.5లక్షల టన్నులు, ప్రస్తుత యాసంగిలో 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. ఇది తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలో అరుదైన విజయంగా నిలిచిందని అన్నారు.

హరీశ్‌ రావు ఆరోపణలన్నీ అసత్యాలు

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు ప్రతి రోజూ అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అసత్యాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచి, వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి, ధాన్యం కొనుగోలు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నేపథ్యంలో.. ఈ విజయం రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరిని ఇస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2025 | 04:00 AM