Mahalakshmi Scheme: రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో మహిళల రికార్డు స్థాయి ప్రయాణాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:14 AM
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఇది రికార్డు
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ నాడు(ఈ నెల 9న) 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగించారు. ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి.
గతేడాది రాఖీ పండుగకు 2.75 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయగా ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. కాగా, రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రాఖీ పండుగకు రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.