Anti Corruption Bureau: ఏసీబీ వలలో అవినీతి శ్రీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:03 AM
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్నట్లు గుర్తించిన రంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ కె.శ్రీనివాసులపై ఏసీబీ కేసు నమోదు చేసింది...
రంగారెడ్డి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ కె.శ్రీనివాసులు
6 ప్రాంతాల్లో భారీగా కూడబెట్టుకున్న ఆస్తులు
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ స్థిరాస్తులు
22 ఎకరాల వ్యవసాయ భూమి, 7 ఇళ్ల ప్లాట్ల గుర్తింపు
రూ.1.83 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు
హైదరాబాద్/ ఆదిభట్ల/ రాయదుర్గం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్నట్లు గుర్తించిన రంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) కె.శ్రీనివాసులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన నివాసం ఉంటున్న రాయదుర్గలోని మైహోం భూజా, కలెక్టరేట్‌లోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు కార్యాలయం, ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ సహా 6 ప్రాంతాల్లోని బంధు మిత్రులు, బినామీలు, ఇతర సహచరుల ఇళ్లపై గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ అధికారుల తనిఖీలు రాత్రి వరకూ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో బయటపడ్డ నగదు, చర, స్థిరాస్తులు, బంగారం, వెండి ఆభరణాలు చూసిన అధికారుల కళ్లు జిగేలుమన్నాయి. కె.శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఈ సోదాల్లో ఏసీబీ గుర్తించింది. మైహోమ్ భూజాలో ఒక ఫ్లాట్, నారాయణపేట జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో కూడిన రైస్‌మిల్లు, 3 ఇళ్ల ప్లాట్లు, కర్ణాటకతోపాటు ఏపీలోని అనంతపూర్‌లలో 11 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. రాయదుర్గలోని శ్రీనివాసుల నివాసంలో రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తుల విలువ డాక్యుమెంట్, మార్కెట్ విలువకంటే పలు రెట్ల అధికమని ఏసీబీ డీజీ చారు సిన్హా తెలిపారు. గతంలోనూ శ్రీనివాసులుపై పలు ఫిర్యాదులొచ్చాయి. హైదరాబాద్ మహా నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలకు అనుమతి ఇచ్చిన ఆరుగురు అధికారులపై గతేడాది సెప్టెంబరులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఈయన కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
కలెక్టరేట్‌లో రాత్రి 7 గంటల వరకు సోదాలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని సర్వే, ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో రాత్రి 7గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీసీపీ వీవీ చలపతి ఆధ్వర్యంలోని బృందం ఉదయం 9 గంటలకే ఏడీ కార్యాలయానికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇక్కడ భూ రికార్డులు, కంప్యూటర్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని మిగతా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది.. ఏసీబీ దాడులతో ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. ఏడీ చాంబర్‌ను ఏసీబీ అధికారులు తన అధీనంలోకి తీసుకొని ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.