Rajiv Swagriha Corporation: పోచారం ఫ్లాట్లకు 8వరకు దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:34 AM
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో పోచారంలో ఉన్న 600 ఫ్లాట్లకు నిర్వహించిన లాటరీలో పోగా మిగిలిన వాటికి ఆగస్టు 8వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో పోచారంలో ఉన్న 600 ఫ్లాట్లకు నిర్వహించిన లాటరీలో పోగా మిగిలిన వాటికి ఆగస్టు 8వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. ఆ ఫ్లాట్లను ఫస్ట్ కమ్ ఫస్ట్ (ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే) విధానంలో కేటాయించనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇది సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకే వర్తిస్తుందన్నారు. పోచారంలో 1, 2, 3బీహెచ్‌కే కలిపి 600 ఫ్లాట్లున్నాయి. వీటికి ఆగస్టు 1, 2 తేదీల్లో లాటరీ నిర్వహించగా.. 401 ఫ్లాట్లను విక్రయించారు. వీటి విక్రయంతో రూ.78 కోట్ల ఆదాయం వచ్చింది.
కాగా, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నామని కూడా ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 200 గజాలు అంతకుమించి ఉన్న ప్లాట్లను ఆగస్టు 4 నుంచి మూడు రోజుల పాటు వేలం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుర్మలగూడలో 20 ప్లాట్లకు 4న, ఇదే జిల్లాలోని తొర్రూర్‌లో 100 ప్లాట్లకు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బహుదూర్‌పల్లిలో 63 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నట్టు ప్రకటనలో తెలిపారు.