Share News

Raja Singh: మా అబ్బ పార్టీ అనుకునే వారి వల్లే రాష్ట్రంలో బీజేపీ నాశనం

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:59 AM

హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ, ఇది మా అబ్బ పార్టీ. మేం చెప్పిందే జరిగి తీరుతుంది.. మేం రాసిందే రాజ్యమవుతుంది..

Raja Singh: మా అబ్బ పార్టీ అనుకునే వారి వల్లే రాష్ట్రంలో బీజేపీ నాశనం

  • వచ్చే రోజుల్లో రాక్షసులు నాశనమవుతారు

  • పార్టీలో కొత్తగా చేరే వారు ఆలోచించాలి

  • మీరు కోరుకున్నది ఏదీ జరగదు

  • టికెట్‌ ఇస్తారనే గ్యారెంటీ ఏమీ ఉండదు

  • 11ఏళ్లుగా అణిచివేత ఎదుర్కొంటున్నా

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ, ఇది మా అబ్బ పార్టీ. మేం చెప్పిందే జరిగి తీరుతుంది.. మేం రాసిందే రాజ్యమవుతుంది.. అని అనుకునే వాళ్ల వల్లే తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అవుతుంది’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘బీజేపీలో చేరుతున్న వారందరూ అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోవాలి. వీలైతే రాసి పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో జరగదు. మీ పై విశ్వాసంతో బీజేపీలో చేరిన కార్యకర్తలకు ఏ పదవీ ఇప్పించలేరు.


ఎన్నికల వేళ మీకే టికెట్‌ వస్తదన్న గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో చేరే ముందు మీరు తొలి వరుస సీటులో ఉంటారు.. ఆ తర్వాత క్రమేణా చివరి సీటుకు వెళ్లిపోతారు. పార్టీలో చేరాక కొన్ని బాధలు కూడా భరించే శక్తిని పెంచుకోవాలి’’ అని సూచించారు. తన నియోజకవర్గంలో 11 ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటున్నానని, మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా.. కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. పార్టీలో చేరే వారు.. కొందరితో చర్చించుకొని వస్తే బాగుంటుందని అన్నారు. విజయశాంతి, జితేందర్‌ రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి.. ఇలా చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి.. ఆ తర్వాత వెళ్లిపోయారని, అలాంటి వారితో చర్చలు జరిపితే బాగుంటుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 04:59 AM