Share News

Traffic Jam: రైళ్లు కిటకిట

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:27 AM

పండుగలు, శుభ ముహూర్తాలకు వరుస సెలవులు కూడా తోడవడంతో హైదరాబాద్‌లోని ప్రధాన

Traffic Jam: రైళ్లు కిటకిట

  • పండుగలు, వరుస సెలవులతో ప్రధానస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ

హైదరాబాద్‌ సిటీ/కొండపాక/చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పండుగలు, శుభ ముహూర్తాలకు వరుస సెలవులు కూడా తోడవడంతో హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. ఆయా స్టేషన్ల మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. ఏసీ తరగతులతో పాటు స్లీపర్‌ క్లాస్‌లోనూ రిజర్వేషన్‌ దొకరకపోవడంతో కొందరు జనరల్‌ కోచ్‌ల్లో నిలబడే వెళ్తున్నారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆపై రెండో శనివారం రాఖీ పండుగ, ఆదివారం సెలవు కావడంతో పాటు వచ్చేవారంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శనివారం కృష్ణాష్టమి, ఆపై ఆదివారం స్కూళ్లకు, పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు వచ్చాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే జనంతో పాటు టెకీలు, కార్పొరేట్‌ ఉద్యోగులు సెలవులు తీసుకొని తమ కుటుంబీకులతో తరలివెళ్తున్నారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో జన్మభూమి, విశాఖ, కోణార్క్‌, గరీబ్‌రథ్‌, గోదావరి, ఈస్ట్‌కోస్‌, గౌతమి ఎక్స్‌ప్రె్‌సలలో రిజర్వేషన్‌ కోసం ప్రయత్నించిన వారికి గత రెండ్రోజులుగా రిగ్రెట్‌ బోర్డులే దర్శనమిచ్చాయి. పలు రైళ్లలో ఇదే పరిస్థితి నెలకొనడంతో కొందరు ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, అద్దె కార్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే రైల్వే చార్జీలతో పోల్చితే బస్సుల్లో రెండింతలు, కార్లలో మూడింతల సొమ్ము చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ

పండుగలు, వరుస సెలవులతో పలు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌ ప్లాజా వద్ద సాయంత్రం వాహనాలు బారులుదీరాయి. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌ వైపు వెళ్లే వారి వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచాయి. ఇటు హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనాల సంఖ్య కూడా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై కూడా విజయవాడ వైపు వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వాహనాల జోరు శనివారం సాయంత్రం వరకు కొనసాగింది.

Updated Date - Aug 10 , 2025 | 03:27 AM