Share News

Rahul Gandhi: బీసీల పోరు తెలంగాణకే పరిమితం కాదు....

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:55 AM

ఓబీసీలకు విద్య, ఉపాధి, స్థానిక పాలనలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ దేశ రాజఽధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నా కేవలం తెలంగాణకే పరిమితం కాదని రాహుల్‌ గాంధీ అన్నారు.

Rahul Gandhi: బీసీల పోరు తెలంగాణకే పరిమితం కాదు....

  • ఇది భారతీయుల సమష్టి యుద్ధం

  • బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి

  • ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌

  • ఇది జాతీయ పోరాటం: ప్రియాంక

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ఓబీసీలకు విద్య, ఉపాధి, స్థానిక పాలనలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ దేశ రాజఽధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నా కేవలం తెలంగాణకే పరిమితం కాదని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ పోరు అణగారిన భారతీయ ప్రజలకు అధికారంలోనూ, అభివృద్ధిలోనూ వాటా కల్పించేందుకు జరుగుతున్న సమష్టి యుద్ధమని ఆయన బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం బిల్లును కులగణన డేటా ఆధారంగా రూపొందించిందని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం దిశగా ఒక ప్రధాన ముందడుగు అని రాహుల్‌ అభివర్ణించారు. ఈ ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతునిచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


తెలంగాణ బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలని ఆయన కోరారు. కాగా, ఓబీసీలకు సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేసిన ధర్నా కేవలం తెలంగాణ పోరు మాత్రమే కాదని, అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం, సమానత్వం, న్యాయం కోసం చేస్తున్న జాతీయ పోరాటమని ప్రియాంకా గాంధీ వాధ్రా అన్నారు. ఈ న్యాయం ఆలస్యమైతే వారికి న్యాయాన్ని నిరాకరించినట్లే అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. విద్య, ఉపాధి, స్థానిక పాలనలో 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు చరిత్రాత్మకమైనదని, కులగణన ఆధారంగా రూపొందించిన సాహసోపేత చర్యగా దీన్ని భావించాలని ప్రియాంక అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలు దేశ రాజధానిలో నిరసన తెలిపారని, ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద నిలిచిపోవడం సరైంది కాదని అన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 03:55 AM