Share News

Quality Healthcare Demanded: చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:58 AM

తక్కువ ధరకే తూతూమంత్రపు వైద్యం కాదు.. నాణ్యమైన, జవాబుదారీతనంతో కూడిన వైద్యం కావాలి.....

Quality Healthcare Demanded: చౌక కాదు  నాణ్యమైన  వైద్యం కావాలి

అవసరమైతే అదనంగా చెల్లిస్తాం జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి

దేశవ్యాప్తంగా 90శాతం రోగుల అభిప్రాయం నాణ్యత ధ్రువీకరణ పొందిన ఆస్పత్రులు

10శాతం లోపే.. ల్యాబ్‌లైతే 2శాతం లోపే!

తొలిదశలో రోగాల గుర్తింపులో వెనకడుగే ఫిక్కీ-ఈవై పార్థెనాన్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకే తూతూమంత్రపు వైద్యం కాదు.. నాణ్యమైన, జవాబుదారీతనంతో కూడిన వైద్యం కావాలి.. వైద్య సేవల్లో పారదర్శకత, ప్రామాణికత పెరగాలి.. అవసరమైతే ఇందుకోసం కాస్త ఎక్కువ సొమ్ము చెల్లించేందుకు కూడా సిద్ధం.. ఇది మన దేశంలోని 90శాతం రోగులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఫిక్కీ, (భారత వాణిజ్య, పరిశ్రమల ఫెడరేషన్‌)ఈవై-పార్థెనాన్‌ సంస్థలు తాజాగా ‘ట్రూ అకౌంటబుల్‌ కేర్‌: మాక్సిమైజింగ్‌ హెల్త్‌కేర్‌ డెలివరీ ఇంపాక్ట్‌ ఎఫిషియెంట్లీ’ పేరిట విడుదల చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎవరో చెప్పారనో, తక్కువ ఖర్చవుతుందనో కాకుండా.. కాస్త ఎక్కువ ఖర్చయినా సరే నాణ్యత ధ్రువీకరణ పొందిన వైద్యసేవలు కావాలని ప్రజలు కోరుతున్నారని తేల్చింది. కరోనా తర్వాతి నుంచి ఈ పరిస్థితి పెరుగుతూ వస్తోందని పేర్కొంది. దేశంలో నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హస్పిటల్స్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య పదిశాతంలోపే ఉందని నివేదిక వెల్లడించింది. ఇక నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబొరేటరీస్‌ (నాబా) గుర్తింపు పొందిన ప్రైవేటు డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు రెండులోపేనని తెలిపింది. దేశంలో పెద్ద పట్టణాల్లోని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు సంబంధించిన వివరాలను ఎలకా్ట్రనిక్‌ మెడికల్‌ రికార్డు(ఈఎంఆర్‌) రూపంలో భద్రపరుస్తున్నాయని వెల్లడించింది. అదే సమయంలో చిన్న పట్టణా లు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రులు ఇంకా పేపర్‌ రికార్డులపైనే ఆధారపడుతున్నాయని వివరించింది.


సర్వేలో తేలిన అంశాలివీ..

వైద్యసేవలకు సంబంధించి నిర్దిష్టమైన, అందరికీ అందుబాటులో ఉండే సమాచారం కావాలన్నవారు.. 83 శాతం

నాణ్యత ధ్రువీకరణ ఉన్న వైద్యసేవల కోసం ఎక్కువ సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నవారు.. 90శాతం

2024 నాటికి దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు అందుబాటులో ఉన్న బెడ్లు.. 1.3.

వైద్యం కోసం ప్రజలు స్వయంగా భరించే వ్యయం.. 2005లో రూ.853.. 2024లో రూ.2,600.

దేశంలో ప్రతి లక్ష జనాభాకు ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు.. 2005లో 1.7.. 2024లో 8.3

ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఒక పడకకు రోజువారీ సగటు ఆదాయం రూ.30,000-రూ.40,000. మెట్రో నగరాల్లో రూ.70,000 వరకు..

దేశంలో 40 ఏళ్లు దాటినవారిలో..

ఊబకాయంతో బాధపడుతున్నవారు 56శాతం

అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 50శాతం

ప్రీడయాబెటిక్‌ స్థితిలో ఉన్నవారు.. 11 శాతం

మానసికఒత్తిళ్లతో బాధపడుతున్నవారు.. 18శాతం

మధ్యాదాయ, అధిక ఆదాయం ఉన్న

40 ఏళ్లుపైబడినవారిలో..

ఊబకాయంతో బాధపడుతున్నవారు 67శాతం

అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 50శాతం

ప్రీడయాబెటిక్‌ స్థితిలో ఉన్నవారు 33శాతం

మానసికఒత్తిళ్లతో బాధపడుతున్నవారు 33శాతం

గుండె దెబ్బతిన్న రోగుల్లో ఏడాదిలోనే చనిపోతున్నవారు.. భారత్‌లో 23శాతం.. చైనాలో 9 శాతం

తీవ్రమైన కిడ్నీ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తున్నది.. భారత్‌లో 52శాతం డెన్మార్క్‌లో 80శాతం.

Updated Date - Oct 13 , 2025 | 05:58 AM