Share News

National Awards:పుట్టపాక చేనేతకు జాతీయ అవార్డులు

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:54 AM

యాదా ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక చేనేతకు జాతీయ గుర్తింపు లభించింది.

National Awards:పుట్టపాక చేనేతకు జాతీయ అవార్డులు

  • యంగ్‌ వీవర్‌లో పవన్‌, మార్కెటింగ్‌లో నర్మదకు పురస్కారాలు

సంస్థాన్‌నారాయణపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): యాదా ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక చేనేతకు జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర చేనేత, జౌళి శాఖ సోమవారం ప్రకటించిన అవార్డుల్లో పుట్టపాకకు చెందిన ఇద్దరికి పురస్కారాలు వరించాయి. యంగ్‌ వీవర్‌ విభాగంలో గూడ పవన్‌ అనే చేనేత కళాకారుడు, మార్కెటింగ్‌ విభాగంలో గజం నర్మద అనే మహిళ పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. కాగా, పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్‌.. బంతిపూలు, దానిమ్మ పండ్లు, వేర్లు వనమూలికలతో తయారుచేసిన సహజ సిద్ధమైన రంగులను మల్బరీ పట్టు దారానికి అద్ది తేలియా రుమాల్‌తో పట్టుచీరను తయారుచేశారు. 16 ఆకృతులు అద్ది మడతలు పడకుండా ఆరు నెలల పాటు శ్రమించి చీరను రూపొందించారు. రూ.75 వేలు ఖరీదు చేసే ఈ చీర పవన్‌కు పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఇక, పుట్టపాకకు చెందిన గజం నర్మద తన భర్త నరేందర్‌ సహకారంతో హైదరాబాద్‌ కొత్తపేటలో నరేంద్ర హ్యాండ్లూమ్స్‌ పేరుతో చేనేత వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2013 నుంచి వ్యాపారంలో ఉన్న నర్మద.. ఏడాదికి రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను విక్రయిస్తూ దాదాపు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో మార్కెటింగ్‌ విభాగంలో ఆమె అవార్డుకు ఎంపికయ్యారు.

Updated Date - Jul 09 , 2025 | 06:54 AM