Marwadi: మార్వాడీలకు వ్యతిరేకంగా పలు చోట్ల ర్యాలీలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:48 AM
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ ఓయూ జేఏసీ, టీజీ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో వ్యాపారులు ప్రదర్శనలు చేశారు.
ఓయూ జేఏసీ నేతల ముందస్తు అరెస్టు
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ ఓయూ జేఏసీ, టీజీ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో వ్యాపారులు ప్రదర్శనలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా గురువారం రాత్రి ఓయూలోని ఎన్‌ఆర్‌ఎ్‌స హాస్టల్‌లో ఉన్న ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతి, నాయకుడు వేణుగోపాల్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. జేఏసీ, విద్యార్థి నేతలను లోపలికెళ్లేందుకు అనుమతించలేదు. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడుతున్న విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హబ్సిగూడలో నవకార్ గోల్డ్‌షాప్ వద్ద టైరు తగులబెట్టారు. ఈ ఘటనలో జేఏసీ వైస్‌చైర్మన్ పాపారావు సహా 8 మందిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బంద్ జరిపారు. ర్యాలీకి అనుమతివ్వక పోవడంతో ఆమనగల్లు వ్యాపారులు తమ దుకాణాల వద్దే నిరసన తెలిపారు.
మార్వాడీల దుకాణాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కడ్తాల్ మండల కేంద్ర వ్యాపారులు.. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి.. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టిన వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో వర్తక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పలు చోట్ల కిరాణా, వర్తక, స్వర్ణ కారులు, నాయి బ్రాహ్మణులతోపాటు ఇతర వ్యాపారులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.