Share News

Medak: ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:55 AM

మాసాయిపేటకు చెందిన దుంపల మహేశ్‌ (38), దుంపల చందు అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహం కాగా వారిని వారి భార్యలు వదిలేసి వెళ్లారు. దాంతో అన్నదమ్ములిద్దరూ వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో వేర్వేరు గదుల్లో ఒంటరిగానే బతుకుతున్నారు.

Medak: ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

మాసాయిపేట. మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం తోడబుట్టిన అన్న ప్రాణాలనే తీశాడో తమ్ముడు. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. మాసాయిపేటకు చెందిన దుంపల మహేశ్‌ (38), దుంపల చందు అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహం కాగా వారిని వారి భార్యలు వదిలేసి వెళ్లారు. దాంతో అన్నదమ్ములిద్దరూ వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో వేర్వేరు గదుల్లో ఒంటరిగానే బతుకుతున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అన్నదమ్ములిద్దరికీ ఉమ్మడిగా అరెకరం పొలం ఉంది. దాని విలువ రూ.30 లక్షల వరకు ఉంటుంది. మద్యానికి బానిసైన చందు.. తన అన్న మహేశ్‌ చనిపోతే ఆ భూమి మొత్తం తనకే వస్తుందని అంటుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి మంచంపై నిద్రిస్తున్న మహేశ్‌ను గొంతు నులిమి చంపేశాడు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించి మృతదేహాన్ని పక్కన దూలానికి తాడు కట్టి వేలాడదీశాడు. ఉదయాన్నే తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులకు, స్నేహితులకు చెప్పాడు. మహేశ్‌ మృతదేహం, అక్కడి పరిసరాలను చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లు అనిపించకపోవడం, చందు పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి వారి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చందును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Updated Date - Mar 05 , 2025 | 03:55 AM