Nizamabad: గౌడ మహిళలను గుడి నుంచి పంపేసిన పూజారి
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:03 AM
నిజామాబాద్ జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను ఆలయం నుంచి పంపించే ఘటన జరిగింది. ఆలయంలో కుంకుమార్చన చేయడం ఆపి, పూజారి, గ్రామ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేసిన మహిళలు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించారు

పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన మహిళలు
పూజారి, ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపై కేసుల నమోదు
మోర్తాడ్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఆలయం నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను పంపించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లోని కోదండరామాలయంలో శ్రీరామ నవమికి ముందు రోజు కుంకుమార్చన జరపడం ఆనవాయితీ. దాంతో శనివారం గౌడ కులానికి చెందిన మహిళలు ఆలయంలోకి వెళ్లారు. అయితే, లోపలికి రానివ్వవద్దని గ్రామ కమిటీ సభ్యులు చెప్పారంటూ.. బయటకు వెళ్లిపోవాలని ఆలయ పూజారి వారికి చెప్పారు. అయినా మహిళలు వెళ్లకపోవడంతో మీరు వెళ్తేనే కుంకుమార్చన చేస్తామని చెప్పడంతో పూజలకు అంతరాయం కలిగించవద్దని మహిళలు బయటకు వెళ్లారు.
అనంతరం వారు ఏర్గట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గ్రామకమిటీ సభ్యు లు, పూజారిపై ఫిర్యాదు చేసి, పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు పూజారిపై, ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. కాగా, గ్రామ కమిటీకి గౌడ సంఘానికి మధ్య వివాదం జరుగుతోంది. గ్రామ కమిటీకి గీత కార్మికులు డబ్బులు ఇవ్వాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేయగా గీత కార్మికులు స్పందించలేదు. దాంతో కళ్లు తాగకుండా కొన్ని నెలలుగా గీత కార్మికులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఇటీవల వివాదం సద్దుమణిగిందని భావించిన ఆ సామాజిక వర్గ మహిళలు శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా ఈఘటన జరిగింది.