Share News

కొత్త పంచాయతీలకు సన్నాహాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:56 PM

నిడమనూరు మండలంలో ఇండ్లకోటయ్యగూడెం శివారుగా ఉన్న మార్తివారిగూడెం. మారుపాక పరిధిలోని గోవిందన్నగూడెం, రేగులగడ్డ పరిధిలోని రాంనగర్‌తండా, గుంటిపల్లి పరిధిలోని జంగాలవారిగూడెం, వల్లభాపురం పరిధిలోని కక్కయ్యగూడెం, వేంపాడ్‌ పరిధిలోని గగన్‌పల్లివారిగూడెం గ్రామాలను కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

 కొత్త పంచాయతీలకు సన్నాహాలు

నిడమనూరు మండలంలో ఇండ్లకోటయ్యగూడెం శివారుగా ఉన్న మార్తివారిగూడెం. మారుపాక పరిధిలోని గోవిందన్నగూడెం, రేగులగడ్డ పరిధిలోని రాంనగర్‌తండా, గుంటిపల్లి పరిధిలోని జంగాలవారిగూడెం, వల్లభాపురం పరిధిలోని కక్కయ్యగూడెం, వేంపాడ్‌ పరిధిలోని గగన్‌పల్లివారిగూడెం గ్రామాలను కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అధికారుల ప్రతిపాదనలతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆశతో ఉన్నారు. ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుతో అదనంగా నిధులు మంజూరై, తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. గతంలో మండలంలో 24 పంచాయతీలు ఉండేవి. గత ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి పల్లెను పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటు నూతన మండలాలు కూడా ఏర్పాటు చేసింది. దీంతో కన్నెకల్‌, ధర్మాపురం పంచాయతీలు మాడ్గులపల్లి మండలంలో, నేతాపురం, మేగ్యాతండా పంచాయతీలు తిరుమలగిరి(సాగర్‌) మండలంలో కలిపారు. అలాగే కొత్తగా గుంటుకగూడెం, సోమారిగూడెం, వెంకటాపురం, ఎర్రగూడెం, పార్వతీపురం, వడ్డెరగూడెం, ఇండ్లకోటయ్యగూడెం, మార్లగడ్డ, బంటువారిగూడెం గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికితోడు అదనంగా కొత్తగా మరో ఆరు పంచాయతీలు ఏర్పాటైతే మండలంలో పంచాయతీల సంఖ్య 35కు పెరిగే అవకాశం ఉంది.

ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటు కావాలని ఆశిస్తున్నారు. గ్రామాలు పంచాయతీలుగా ఏర్పాటైతే సర్పంచ్‌ పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఉంటాయి. దీంతో గ్రామాల్లో పదవులు పొంది పెత్తనం చేయాలనుకునేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. వివిధ పదవుల కోసం పోటీపడే ఆశావహులు నూతన పంచాయతీల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే తమ గ్రామాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కావాలని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు.

ఆరు పంచాయతీలకు ప్రతిపాదనలు పంపాం -గుర్రం వెంకటేశం, ఎంపీడీవో, నిడమనూరు

మండలంలో మార్తివారిగూడెం, గోవిందన్నగూడెం, కక్కయ్యగూడెం, రాంనగర్‌తండా, జంగాలవారిగూడెం, గగనపల్లివారిగూడెం ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ఆయా గ్రామాల్లో జనాభా, ఓటర్లు, పాత పంచాయతీలకు ఉన్న దూరం తదితర అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - Jan 16 , 2025 | 11:56 PM