Share News

Prashanth Kumar: గోవుల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నారనే..

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:02 AM

గోవుల అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తున్నాడన్న కోపంతోనే గోరక్షక్‌ దళ.....

Prashanth Kumar: గోవుల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నారనే..

  • ప్రశాంత్‌పై కాల్పులు

  • నిందితుడితో ఆయనకు ముందే పరిచయం

  • మాట్లాడదామని పిలిచి ఇబ్రహీం కాల్పులు

  • ప్రశాంత్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

  • గంటల వ్యవధిలోనే ముగ్గుర్ని అరెస్టు చేశాం

  • ప్రశాంత్‌ ప్రాణాలకు ప్రమాదం లేదు: సీపీ

  • గోవులతో రూ.కోట్ల దందా చేస్తుంటే ఏం చేస్తున్నారు?.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌

  • ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట

  • వచ్చే నెల తొలివారంలో ‘ఛలో హైదరాబాద్‌’

  • కాలేజీ యాజమాన్యాల సమ్మెకు మద్దతు ప్రకటించిన రాంచందర్‌రావు

  • ప్రశాంత్‌ డబ్బు డిమాండ్‌ చేశాడని ఆరోపిస్తున్నారు

  • ఛత్తీ్సగఢ్‌ నుంచి తపంచా కొనుగోలు చేసిన ఇబ్రహీం

  • ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు భయం

  • ప్రశాంత్‌కు బీజేపీ నేతల పరామర్శ

  • డీజీపీ ఆఫీసుకు వెళ్తున్న రాంచందర్‌రావు అరెస్టు

  • హైదరాబాద్‌ సిటీ/ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గోవుల అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తున్నాడన్న కోపంతోనే గోరక్షక్‌ దళ సభ్యుడు ప్రశాంత్‌కుమార్‌ అలియాస్‌ సోనూసింగ్‌పై ఇబ్రహీం ఖురేషీ కాల్పులకు తెగబడ్డాడని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ కేసులో గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు ఇబ్రహీం, బాధితుడు ప్రశాంత్‌లకు గతంలోనే పరిచయం ఉందని చెప్పారు. ఈ కేసులో సాంకేతికతను ఉపయోగించి, పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘బండ్లగూడకు చెందిన మొహమ్మద్‌ ఇబ్రహీం ఖురేషీ(24) అక్రమంగా పశువులను కబేళాలకు విక్రయిస్తున్నాడు. అత్తాపూర్‌కు చెందిన బిడ్ల ప్రశాంత్‌ కుమార్‌ అలియాస్‌ సోనూసింగ్‌ (28) ఏడాది క్రితం కుటుంబంతో కీసర ప్రాంతానికి మకాం మార్చాడు.


  • డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును తరలిస్తున్న పోలీసులు

ప్రశాంత్‌ గోరక్ష దళంలో సభ్యుడిగా ఉన్నాడు. ఇబ్రహీం అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టిన ప్రశాంత్‌ పలుమార్లు అతణ్ని అడ్డుకొని, పోలీసులకు అప్పగించాడు. దీంతో ఇబ్రహీంకు దాదాపు రూ.కోటి వరకు నష్టం వాటిల్లింది. కోపం పెంచుకున్న ఇబ్రహీం.. మాట్లాడాలంటూ తన స్నేహితుడు కురువ శ్రీనివా్‌సతో ప్రశాంత్‌కు కబురు పెట్టాడు. శంషాబాద్‌లో కలుద్దామని శ్రీనివాస్‌ సూచించగా, ప్రశాంత్‌ వారిని పోచారం రమ్మన్నాడు. ఇబ్రహీం తన స్నేహితులు మహ్మద్‌ హనీఫ్‌ ఖురేషీ(34), మస్నాబిన్‌ మోసిన్‌(22), శ్రీనివా్‌సలతో కలిసి పోచారం వెళ్లాడు. ఇబ్రహీం, ప్రశాంత్‌ కలిసి హోటల్‌ వెనక్కి వెళ్లి.. గంటకుపైగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇబ్రహీం తన దగ్గరున్న తపంచాతో ఓ రౌండ్‌ గాల్లోకి కాల్చి, మరో రౌండ్‌ ప్రశాంత్‌ను కాల్చి, స్నేహితులతో కలిసి పరారయ్యాడు’ అని సీపీ తెలిపారు. ప్రశాంత్‌ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రశాంత్‌, ఇబ్రహీం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరుల్లో గోవుల అక్రమ రవాణా గురించి ప్రశాంత్‌కు తెలిసినా.. సమాచారం ఇవ్వలేదని సీపీ తెలిపారు. గోవుల అక్రమ రవాణా సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు ప్రశాంత్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు నిందితుడు శ్రీనివాస్‌ చెప్పాడన్నారు.

ఛత్తీ్‌సగఢ్‌లో తుపాకీ కొని..

ఇబ్రహీం ఖురేషీ ఛత్తీ్‌సగఢ్‌లోని స్నేహితుడి ద్వారా తపంచా కొనుగోలు చేశాడని సీపీ సుధీర్‌బాబు చెప్పారు. ఆ తుపాకీతోనే ప్రశాంత్‌పై కాల్పులు జరిపాడన్నారు. ఈ కేసులో మరో నిందితుడు హనీఫ్‌ ఖురేషీ పరారీలో ఉన్నాడని, అతడిని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం తెలుస్తుందని చెప్పారు. నిందితుల నుంచి తపంచా, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించామన్నారు. పశువులను అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


మీరేం చేస్తున్నారు?: బీజేపీ

గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భయపడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. గురువారం ఆయన ఎంపీ కె.లక్ష్మణ్‌, బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్‌ తదితరులతో కలిసి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనూ సింగ్‌ను పరామర్శించారు. అతని వైద్యానికయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని, అతనికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోవులను గోశాలకు తరలిస్తామని సీఎం చెప్పడం కాదని.. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ‘హిందువుల మనోభావాలను, హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, గోరక్షకులను అవమానిస్తే కేసీఆర్‌కు ఎలాంటి గతి పట్టిందో చూడండి. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది’ అని సంజయ్‌ చెప్పారు. సోనూసింగ్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడని చెప్పడం దుర్మార్గమని, ఇబ్రహీం వ్యాపారానికి రూ.కోటి నష్టం వాటిల్లిందని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

డీజీపీకి వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఇప్పటికే 500కు పైగా హత్యలు జరిగాయని, తుపాకీ సంస్కృతి పెరిగిపోయిందని, పోలీసుల ప్రాణాలు కూడా పోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు. డీజీపీకి వినతిపత్రం అందించేందుకు బయల్దేరిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో నడుస్తున్నది రేవంత్‌రెడ్డి సర్కారు కాదని, రేవంతుద్దీన్‌ సర్కారని రాంచందర్‌రావు ఆరోపించారు. బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గన్‌ కల్చర్‌ పెరిగిందన్నారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు.

Updated Date - Oct 24 , 2025 | 06:02 AM