ప్రాణం తీసిన ఉరితాడు సరదా!
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:36 AM
ఈ ఘటన కాచిగూడ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిలక్ నగర్‌లో నివాసముంటున్న యాకయ్య కుమారుడు ఆదర్శ్(25) నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

త్వరలో ప్రేమపెళ్లి.. ప్రియురాలిని భయపెట్టేందుకు మెడకు ఉరి తాడు.. అది బిగిసి క్యాబ్‌డ్రైవర్ మృతి
బర్కత్‌పురా, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టేందుకు సరదాగా వేసుకున్న ఉరితాడు బిగిసి ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిలక్ నగర్‌లో నివాసముంటున్న యాకయ్య కుమారుడు ఆదర్శ్(25) నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఐదేళ్లుగా నల్లకుంటలో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. వచ్చే ఏప్రిల్ నెలలో వీరిద్దరికి వివాహం కావాల్సి ఉంది. అయితే సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైరుతో ఉరేసుకుంటున్నట్లు సరదాగా చూపించి కాబోయే భార్యను భయపెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఫొటో తీసి ఆమెకు పంపించాలని భావించాడు. కాగా ఉరి వేసుకుంటున్నట్లు చూపించే తరుణంలో పొరపాటుగా ఐరన్ బాక్స్ వైరు ఆదర్శ్ మెడకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. అతడి మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.