Medical Education: వైద్యవిద్యలో పీజీ చేసినా.. 50 శాతం మంది సర్జరీ చేయలేరు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:28 AM
ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కత్తి పట్టుకునేందుకు యువ వైద్యుల చేతులు వణుకుతున్నాయని...
శస్త్రచికిత్స చేయాలంటే తమపై తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు
కౌన్సెలింగ్ సౌకర్యాలు లేవన్న 54% మంది
70 శాతం పీజీలకు నిర్దిష్ట పనివేళలు లేవు
62 శాతం మందికి స్టైపెండ్ ఆలస్యం
కొత్త వైద్య కాలేజీల్లో మౌలిక వసతుల లేమి
‘ఫైమా- ఆర్‌ఎంఎస్’ సర్వే సంచలన నివేదిక
దేశవ్యాప్తంగా 2వేల మందికి పైగా మెడికోలు, డాక్టర్లతో సర్వే.. ఎన్‌ఎంసీకి నివేదిక
తక్షణమే సంస్కరణలు చేపట్టాలని వినతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కత్తి పట్టుకునేందుకు యువ వైద్యుల చేతులు వణుకుతున్నాయని... గైనకాలజీ చేసినా సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలా మంది ఉంటున్నారని.. తాజా సర్వేలో వెల్లడైంది. పీజీ పూర్తి చేసిన వైద్యుల్లో 50.5 శాతం మంది.. సొంతంగా సర్జరీ చేసే విషయంలో తమపై తమకే నమ్మకం కలగట్లేదని ఈ సర్వేలో చెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో వైద్య విద్య ప్రమాణాలు, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మెడికోల మానసిక ఆరోగ్యంపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్’ (ఫైమా) నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్(ఆర్‌ఎమ్‌ఎస్) సర్వే -2025లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2,000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వే నివేదికను ఫైమా బుధవారం జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎమ్‌సీ) చైర్మన్‌కు అందజేసింది. విద్యార్ధుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని.. వైద్య విద్యలో తక్షణ సంస్కరణలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
వసతుల లేమి..
కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉండట్లేదని ఫైమా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తాగునీరు, లైబ్రరీలు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, తగినంత మంది భద్రతా సిబ్బంది లేనట్టు తేలింది. అలాగే ఆసుపత్రుల్లో పడకలు, పర్యవేక్షణ సిబ్బంది, పేషెంట్ ఎక్స్‌పోజర్ సరిపోకపోవడం వల్ల.. మెడికల్ కోర్సులు నామమాత్రం అవుతున్నాయనే అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమైంది. అత్యధిక వైద్య కళాశాలల్లో విద్యార్థులకు పేషెంట్ ఎక్స్‌పోజర్ లేకపోవడంతో.. శస్త్రచికిత్స చేయడానికి వారు భయపడుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో‘‘యూనిఫామ్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్’’ను అన్ని కాలేజీల్లో తప్పనిసరి చేయాలని ఫైమా సూచించింది.
ప్రమాదంలో మెడికోల మానసిక ఆరోగ్యం
దేశవ్యాప్తంగా చాలా కాలేజీలు యాంటి రాగింగ్ నిబంధనలు పాటించడం లేదు. అలాగే మెడికోలకు కౌన్సెలింగ్ సౌకర్యాలు లేవు. వారికి మానసిక ఆరోగ్యంపై సాయమందించే వ్యవస్థ లేదని ఫైమా సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం ఇలా 54.4 శాతం మంది మెడికల్ విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం అందడం లేదు. ప్రతి కాలేజీలో మెంటల్ హెల్త్ కమిటీ, 24 గంటల హెల్ప్‌లైన్, ప్రతి 500 మందికి 2 మంది కౌన్సిలర్లు, తప్పనిసరిగా ఉండాలని ఫైమా సూచించింది.
కుంగదీస్తున్న పనివేళలు..
పీజీ, రెసిడెంట్లపై పని భారం ప్రమాదకరస్థాయిలో ఉందని ఫైమా రిపోర్ట్ వెల్లడించింది. 70.5 శాతం మందికి ఫిక్స్‌డ్ డ్యూటీ అవర్స్ (నిర్దిష్ట పనివేళలు) లేవు. 73.8ు మందిని క్లరికల్ పనుల్లో ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు 24 గంటలకుపైగా హాస్పిటల్లో డ్యూటీలు వేస్తున్నారు. దీంతో నిద్ర లేక.. ఒత్తిడికి గురికావడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలు బాగా పెరుగుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. అలాగే సర్వేలో 62.1 శాతం మంది విద్యార్థులు తమకు స్టైపెండ్ సమయానికి రావడం లేదని వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో భారీ తేడాలు ఉండటంతో అందరికీ యూనిఫాం పే ేస్కల్ అమలు చేయాలని మెడికోలు కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
సర్వేలో వెల్లడైన మరికొన్ని ముఖ్యాంశాలు
కేవలం మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్లు పెంచడంపైనే దృష్టి పెడుతున్నారని.. కళాశాల్లో మౌలిక సదుపాయాలు అడుగుంటుతున్నాయని సర్వే పేర్కొంది.
తమ కాలేజీల్లో పూర్తిస్థాయి గ్రంథాలయం లేదని 50 శాతం మంది విద్యార్థులు తెలిపారు.
ప్రమాణాలకు తగిన క్లినికల్ ప్రయోగశాలలు లేవని 47.6 శాతం మంది వెల్లడించారు.
శరీర నిర్మాణం గురించి తెలుసుకునేందుకు అవసరమైన మృతదేహాల లభ్యత పరిమితంగా ఉందని 52.2 శాతం మంది పేర్కొన్నారు.
తగినంత మంది నర్సింగ్ సిబ్బంది, మానవ వనరులు లేక రోగుల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు 72.9ుమంది మెడికోలు తెలిపారు.
.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 90.3ు మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివేవారు కాగా, 7.8 శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మిగిలిన వారు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలకుచెందిన వారున్నారు. ఇక 61 శాతం మంది యూజీలు కాగా, 29.9 శాతం పీజీలు సర్వేలో పాల్గొన్నారు. మిగిలిన వారంతా సీనియర్ రెసిడెంట్స్, అఽధ్యాపకులు.

నేర్చుకోవాలనే తపనేఉండట్లేదు
ఈ తరం వైద్య విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన ఉండా లి. అది లేకుంటే ఉపయోగం ఉండదు. గతంలో ఎంబీబీఎస్ చేసిన వారు సొంతంగా క్లినిక్‌లు పెట్టుకుని సర్జరీలు చేసేవారు. నేటి తరం వారి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటున్నాయి. కొద్దిపాటి పనిగంటలకే తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. దీంతో అధ్యాపకులు కూడా కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. ప్రొఫెసర్ కఠినంగా ఉంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా వైద్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఇటువంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి. వైద్యవిద్యార్దుల్లో కమిట్‌మెంట్ ఉండాలి. మెడిసిన్‌ను స్టేటస్ సింబల్‌గా చూడవద్దు. అదోక సేవా వృత్తిగా భావించాలి.
- డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్
ఇవీ చదవండి:
Indias IT Market: 2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు
Apples Market Value: యాపిల్ 4 లక్షల కోట్ల డాలర్లు