Ponnam Prabhakar: ఈడబ్ల్యూఎస్ కోసం 50ు కోటా ఎత్తేసినపుడు, బీసీల కోసం ఎందుకు ఎత్తేయరు?: పొన్నం
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:00 AM
అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం కోటా పరిమితిని ఎత్తేసినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎందుకు ఎత్తేయరు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం కోటా పరిమితిని ఎత్తేసినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎందుకు ఎత్తేయరు? అని కేంద్రాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ చేసే అధికారం ఉంటుందని, రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు.. ఆర్డినెన్స్‌కు సంబంధం లేదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేస్తున్నామన్నారు. బరాబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టంచేశారు.
బీసీ బిడ్డ అయ్యుండి కూడా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ బీసీల రిజర్వేషన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు చేతనైతే బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని చురకలంటించారు. కాగా, ఎమ్మెల్సీలు కవిత - తీన్మార్ మల్లన్న వివాదంపై స్పందిస్తూ.. మహిళల పట్ల అలా మాట్లాడడం సరికాదని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని అన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వాదులంతా ఖండిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దాడులు చేయడం కూడా సరైనది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.