Share News

Ponnam Prabhakar: కామారెడ్డి సభతో కాంగ్రెస్‌ సత్తా చూపెట్టాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:34 AM

కామారెడ్డి బహిరంగ సభతో కాంగ్రెస్‌ సత్తా ఏంటో బీజేపీకి చూపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: కామారెడ్డి సభతో కాంగ్రెస్‌ సత్తా చూపెట్టాలి

  • బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మోకాలడ్డు

  • యూరియా విషయంలోనూ వివక్ష: పొన్నం

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి బహిరంగ సభతో కాంగ్రెస్‌ సత్తా ఏంటో బీజేపీకి చూపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో తాము చట్టం చేస్తే.. ఆ రిజర్వేషన్లు పెరగకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు మోకాలడ్డుతోందని దుయ్యబట్టారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పొన్నం మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత అవగాహన కల్పించాలని నేతలకు సూచించారు. పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చామని.. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతోనూ పొన్నం మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు యూరియా కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని.. ఎరువుల కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ సర్కారు పట్ల రైతుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రైతాంగాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పుడు మీ ఓటు ఎవరికి..?

‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే ఓటు వేస్తాం.. లేకపోతే వేయమని కేటీఆర్‌ అన్నారు కదా.. మరి ఇప్పుడు యూరియా ఇవ్వలేదు.. ఓటు ఎవరికి వేస్తారు..? తెలుగు బిడ్డకు వేస్తారా.. ఎవరికో వేస్తారా..! కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌.. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణకు అవసరమైన ఎరువులు అందించేలా కేంద్రంతో మాట్లాడండి.’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన తెలంగాణకు ఎరువులు పంపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఎరువులు, రైతులపై అవగాహనే లేదని.. ఆయనకు తెలిసిందల్లా రిజర్వేషన్లను వ్యతిరేకించడమేనని ఎద్దేవా చేశారు.

Updated Date - Sep 09 , 2025 | 04:34 AM