Share News

Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలు బాధ్యత కలెక్టర్లదే: పొంగులేటి

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:34 AM

ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టాలను సమర్థంగా అమలు చేసి.. వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలు బాధ్యత కలెక్టర్లదే: పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టాలను సమర్థంగా అమలు చేసి.. వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో పలు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే.. సొంతింటి కల నెరవేరుతుందనే విశ్వాసంతో ప్రజలు తమకు అధికారం అప్పగించారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం రేవంత్‌ ఆలోచనల మేరకు ఈ పథకాలకు శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎవరైనా అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేయడానికి వెనుకాడొద్దని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ప్రతీ సోమవారం ఇళ్ల కోసం బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఇక రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రతి సామాన్యుడు సంతృప్తి పడేలా పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు.


దేశానికే ఆదర్శంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకస్మిక వర్షాలు, వరదల సమాచారాన్ని వాతావరణ విభాగంతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు కిందిస్థాయి వరకు సమాచారం అందించాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 03:34 AM