Share News

Political Challenges: నల్లగొండ జిల్లాలో సవాళ్ల పర్వం

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:24 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగాయి.

Political Challenges: నల్లగొండ జిల్లాలో సవాళ్ల పర్వం

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఒక్క సీటు కూడా గెలవనివ్వను

  • మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి సవాల్‌

  • దమ్ముంటే రాజీనామా చేయ్‌

  • నువ్వు గెలిస్తే రాజకీయ సన్యాసం: వేముల

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తానొక్కడినే ఎమ్మెల్యేగా గెలిచానన్న మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 12 సీట్లూ బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వబోనని చాలెంజ్‌ చేశారు. ఆయన సవాల్‌పై ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి (భువనగిరి), వేముల వీరేశం (నకిరేకల్‌) ప్రతిస్పందించారు. ‘జగదీశ్‌రెడ్డి.. దమ్ముంటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేయ్‌. నీ మీద నేను గానీ, బీర్ల అయిలయ్య గానీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సూర్యాపేటలో మళ్లీ నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని వీరేశం సవాల్‌ చేశారు. బీజేపీతో లాలూచీ వల్లే సూర్యాపేటలో జగదీశ్‌ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని అనిల్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గంజాయి మొక్కలాంటి వాడు జగదీశ్‌ రెడ్డి అని ఆరోపించారు.

Updated Date - Jul 16 , 2025 | 06:24 AM