A three month old: పోలియో చుక్కలు వికటించి
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:50 AM
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది......
3 నెలల చిన్నారి మృతి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మృతదేహం పోస్టుమార్టానికి తరలింపు
16.35 లక్షల పిల్లలకు పల్స్ పోలియో
నారాయణఖేడ్, కంగ్టి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వికటించి మూడు నెలల మగ శిశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన సర్కున్‌దొడ్డి ఉమాకాంత్, స్వర్ణలత దంపతులకు ముగ్గురు కూతుళ్లు, మూడు నెలల కుమారుడు ఉన్నారు. వారికి ఆదివారం పోలియో చుక్కలు వేయించేందుకు తల్లి స్వర్ణలత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. ఆశావర్కర్లు పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికే శిశువు ఏడవడం ప్రారంభించడంతో పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నిస్తుండగానే పసికందు ప్రాణాలు కోల్పోయింది. వైద్యాధికారి నాగమణి శిశువును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయడం ద్వారానే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి శిశువును పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి నాగమణిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. శిశువుకు వేసిన పోలియో చుక్కల సీసా నుంచి మరో 17 మందికి వేశామని, ఎవరికీ హాని జరగలేదని తెలిపారు. బాధిత కుటుంబంలోని ముగ్గురు చిన్నారులకు కూడా చుక్కలు వేసినా ఏమీ కాలేదని చెప్పారు. శిశువు అనారోగ్యంతో మృతి చెందిందా.. చుక్కలు వికటించి మృతి చెందిందా.. అనే విషయం పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడవుతుందని పేర్కొన్నారు.
చిన్నారి మృతికి పోలియో చుక్కలు కారణం కాదు: ఎమ్మెల్యే
శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. పోలియో చుక్కలను ఒకే సీసా నుంచి శిశువుకు, వారి అక్కలకు, గ్రామంలోని ఇతర చిన్నారులకు వేశారని చెప్పారు. పోలియో చుక్కలు వేశాక తల్లి పాలు పట్టిందని, దీంతో శిశువు వాంతులు చేసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. వాంతులతో యాష్ ప్రెషర్ అయ్యి మృతి చెందిందని, పోలియో చుక్కలు గానీ, వైద్యుల నిర్లక్ష్యం గానీ కారణం కాదని వివరించారు.